February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

దారుణం.. ప్రిన్సిపల్ మందలించాడనీ స్కూల్‌ భవనంపై నుంచి దూకిన విద్యార్ధి! ఆ తర్వాత ఏం జరిగిందంటే

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో స్కూల్లో తోటి విద్యార్ధితో కబుర్లు చెబుతున్న విద్యార్ధిని స్కూల్ ప్రిన్సిపల్ తన గదికి పిలిపించి మందలించాడు. అంతే.. అవమానంగా భావించిన ఆ విద్యార్ధి దారుణ నిర్ణయం తీసకున్నాడు. ప్రిన్సిపల్ మందలించాడన్న కోపంతో ఆ విద్యార్ధి ఏకంగా స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లో..


హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: ఒకప్పుడు విద్యార్ధులు అల్లరి చేస్తే స్కూల్లో టీచర్లు రకరకాల శిక్షలు విధించి వారిని సరైన మార్గంలో పెట్టేవారు. మరీ పెంకి పెల్లలైతే నాలుగు దెబ్బలు తగిలించి బుద్ధి చెప్పేవారు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరేలా ఉంది. పల్లెత్తిమాటంటే చాలు విద్యార్ధులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా టీచర్లపై కేసులు పెట్టే వరకు వెళ్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా పిల్లలను సరైన మార్గంలో ఎలా పెట్టాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పదో తరగతి విద్యార్ధిని ఓ స్కూల్ ప్రిన్సిపల్ మందలించాడన్న కోపంతో ఆ విద్యార్ధి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం..


హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీఎస్‌కే వెంచర్‌లో నివాసం ఉంటున్న హరిభూషణ్‌ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్‌ (15). స్థానికంగా ఉన్న శాస్త్ర స్కూల్‌లో నీరజ్‌ పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన నీరజ్‌ మరో స్నేహితుడితో కలిసి క్లాస్‌రూం నుంచి కారిడార్‌కు వచ్చాడు. అక్కడ కబుర్లు చెప్పుకోవడం గమనించిన ప్రిన్సిపాల్‌ నరేందర్‌రాయ్‌ వారిద్దరినీ తన గదికి పలిచి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన నీరజ్‌ అదే రోజు సాయంత్రం 4 గంటలకు సుమారు 20 అడుగుల ఎత్తున్న స్కూల్‌ భవనం పైనుంచి కిందికి దూకాడు.


దీంతో పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది గమనించి వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం నీరజ్‌ను హైదరాబాద్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. నీరజ్‌ భవనంపై నుంచి కింద పడిపోయిన దృశ్యాలు స్కూల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిభూషణ్‌ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్‌తో పాటు మరో కూతురు ఉంది. మంగళవారం హరిభూషణ్‌ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

Also read

Related posts

Share via