February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: కన్న కూతురికి చిత్రహింసలు…వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే!


పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతరిని చిత్రహింసలు పెట్టింది. ఐదురోజులుగా అన్నం పెట్టకుండా కడుపుమాడ్చడంతో పాటు కర్కశంగా అట్లకాడతో వాతలు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు

అక్రమసంబంధాలు, వివాహేతర వ్యవహారాలు  మానవ సంబంధాలను మంటలో గలుపుతున్నాయి. కన్నపేగు అన్న మమకారం లేకుండా కడతేర్చడానికి కూడా పురికొల్పుతున్నాయి. గడచిన కొంతకాలంగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో నేరాలన్నీ అక్రమ సంబంధాల నేపథ్యంలోనే జరుగుతుండటం గమనార్హం. అక్రమ సంబంధాలతో కట్టుకున్నవాడిని కాటికి పంపుతున్న భార్యలు  కొందరైతే, తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో కన్నవారికి నరకం చూపిస్తున్న తల్లులు మరికొందరు. అమ్మ..అవనీ..నేలతల్లి అంటూ కీర్తించాల్సిన ఆడతనానికి మచ్చతెస్తున్నారు కొందరు మహిళాశిరోమణులు.

ఏ జీవి అయినా తన కన్న పిల్లలను ప్రాణపదంగా ప్రేమిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు ఇతర జీవుల్లో ఏమో గానీ, మనుషుల్లో మాత్రం మానవత్వం అనేది కనుమరుగవుతోందా? అనే సందేహం కలిగిస్తోంది. తాజా ఘటన చూస్తే అది నిజమేమోనని అనిపిస్తుంది. ప్రియుడి కోసం ఓ మహిళ తన కన్న బిడ్డను చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం కలిగించింది

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతరిని చిత్రహింస పెట్టింది. గడచిన ఐదురోజులుగా అన్నం పెట్టకుండా కడుపుమాడ్చడమే కాకుండా కర్కశంగా అట్లకాడతో వాతలు పెట్టింది. ఒకవైపు ఆకలి, మరోవైపు వాతలు తేరిన శరీరంతో ఆ పసిపాప నరకం అనుభవిస్తున్న ఆ కన్నతల్లి మనసు కరగలేదు. పాప ఏడుపు విన్న స్థానికులు 1098 నెంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు మాధవి ఇంటికి చేరుకున్నారు. పోలీసుల రాకను గుర్తించిన మాధవి  పాపను దాచిపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఐసీడీఎస్‌ అధికారులు దాడులు నిర్వహించి పాపను గుర్తించారు. కాగా తల్లి మాధవితో పాటు ఆమెకు సహకరించిన శివపార్వతి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బాలికను నరసరావుపేట శిశు సంక్షేమ గృహనికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via