February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ప్రభుత్వ హాస్టల్‌లో మరో విద్యార్థి మృతి.. పట్టించుకోని సర్కార్!



తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లు పేదల బిడ్దలకు శాపంగా మారాయి. కడుపు నింపి, నాలుగు అక్షరాలు నేర్పిస్తాయన్న ఆశతో పేద తల్లిదండ్రులు ఎందరో గంపెడు ఆశలతో తమ బిడ్డలను గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో చేర్పించి చదివిస్తున్నారు. కానీ అధ్వాన్నంగా మారిన హాస్టళ్ల వసతి సౌకర్యాలు విద్యార్ధులను మృత్యు దేవతకు అప్పగిస్తున్నాయి..


గోపాల్‌పేట, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు విద్యార్ధుల పాలిట యమపాశాల్లా మారాయి. ఇప్పటికే గురుకుల హాస్టళ్లలో చదువుతున్న పలువురు విద్యార్ధులు మృతి చెందగా.. తాజాగా మరో ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటస్వామి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటస్వామి హైదరాబాద్‌లోని లింగంపల్లిలో రెండేండ్ల కిందట తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అప్పటి నుంచి అరుణ కూలీ పనులు చేసుకొని పిల్లలను పోషిస్తుంది. అరుణ పెద్ద కుమారుడు భరత్‌ (13) గోపాల్‌పేట ఎస్సీ బాలుర ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.


సోమవారం ఉదయం భరత్‌ స్నానం చేసి స్టడీ అవర్‌లో విద్యార్థులతో కలిసి చదువుకుంటున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కిందపడిపోవడంతో పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకు వెళ్లారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతిచెందడంతో అరుణ బోరున విలపించింది.

రెండేండ్ల కిందట భరత్‌ తండ్రి వెంకటస్వామిని పోగొట్టుకున్న అరుణ.. ఇప్పుడు కొడుకు భరత్‌ కూడా మరణించడంతో గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. దీంతో బీఆర్‌ఎస్వీతోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు దవాఖాన వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై మృతదేహంతో బైటాయించి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో వరుసగా విద్యార్ధులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఘటనా స్థలానికి ఆర్డీ వో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు చేరుకొని విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు

Also Read

Related posts

Share via