ప్రేమ పేరుతో యువతులకు వలేసి మాయమాటలు చెప్పి వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి, వాళ్లను పెళ్లిళ్లు చేసుకుని, సంతానం కూడా కలిగాక.. చెప్పాపెట్టకుండా ఇల్లోదిలి పరారవుతున్న ఘరానా మోసగాడు ఎట్టకేలకు చిక్కాడు..
మేడ్చల్, జనవరి 14: మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడో కేటుగాడు. తాజాగా ఇతగాడి బండారం రెండో భార్య కనిపెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జవహర్‌నగర్ పోలీసులు నిత్య పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం..
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్, అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్పేట్లో లక్ష్మణరావు (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇతడికి 2014లో బంధువుల అమ్మాయి అనూషతో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఆమెతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికి మెదక్ చర్చిలో 2021లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆమెతో కూడా విభేదాల కారణంగా దూరంగా ఉంటూ తప్పించుకుని తిరగసాగాడు. ఇక 2022లో శబరి అనే మరో యువతితో పరిచయం పెంచుకుని ఆమెనూ వివాహం చేసుకున్నాడు.
లక్ష్మణరావు మల్కాజిగిరిలో ఉంటున్నాడని రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు తెలుసుకుని అక్కడికి చేరుకోగా.. అక్కడ మరో మహిళ శబరిని వివాహం చేసుకున్నట్లు తెలుసుకుని షాకయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై లీలావతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లక్ష్మణరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





