February 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Dead Body Parcel: మరో పెట్టె ఎవరి కోసం?

పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్క పెట్టెలో శవాన్ని పంపిన కేసులో క్రమంగా చిక్కుముడులు వీడుతున్నాయి.

👉 నిందితుడు శ్రీధర్ వర్మ ఇంట్లో ఇంకో చెక్క పెట్టె!

👉 చెక్క పెట్టెలో మృతదేహం కేసులో కొత్త కోణాలు



భీమవరం, ఉండి, : పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసులో క్రమంగా చిక్కుముడులు వీడుతున్నాయి. ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యదేనని స్థానికులు గుర్తించారు. నిందితుడిగా భావిస్తున్న తులసి సోదరి భర్త తిరుమాని శ్రీధర్ వర్మ పోలీసులకు చిక్కగా, అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. పర్లయ్య సొంత గ్రామమైన కాళ్ల గ్రామం గాంధీనగరంలోనే నిందితుడు శ్రీధర్వర్మ కూడా ఉంటున్నట్లు నిర్ధారించారు. గ్రామంలో వివాదరహితుడిగా, కలుపుగోలుగా ఉండే తమలో ఒకరైన పర్లయ్యను హత్య చేయడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశాడని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ వర్మ ఇంట్లో అనుమానాస్పద రీతిలో చేతబడి చేసే సామగ్రి, పుస్తకాలు, మరో పెట్టె దొరకడంతో వాటిని ఎవరి కోసం సిద్ధం చేసి ఉంచాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అసలు అతడు చేసే వృత్తి ఏంటి? ఆదాయం ఎలా వస్తుంది? గంజాయి ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా తదితర విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది. వదిన తులసిని ఆస్తి కోసమే బెదిరించడానికైతే ఒక వ్యక్తిని చంపి చెక్కపెట్టెలో శవాన్ని పంపించాల్సిన అవసరం ఏముంది? ఆ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు తదితర అంశాలపై కూపీ లాగుతున్నట్లు తెలిసింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతడు దాటవేత ధోరణిలో సమాధానాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులైనా కేసు కొలిక్కి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడికి సహకరించిన మహిళ ఎవరు.. అతడు వాడిన కారు ఎవరిదనేది కూడా ఇంతవరకు తేలలేదు. ఆ కారుకు ఉన్న నంబరు గురించి ఆరా తీయగా అది బైక్ కు సంబంధించినదిగా తేలినట్లు సమాచారం.

Also Read

Related posts

Share via