February 3, 2025
SGSTV NEWS
Telangana

వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన  సంఘటనపై ఆలయ ఈవో, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అపచారాలు సహించమని.. భక్తులకు మళ్ళీ ఇటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

46 వేలమంది భక్తులు..
తెలంగాణలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. ఇక్కడ కొలువైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈరోజు కూడా 46 వేలమంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఎప్పుడూ లేనిది ఇలా మొట్టమొదటిసారి ఆలయ ప్రాంగణంలో అపశృతి చోటు చేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read

Related posts

Share via