బుడిబుడి అడుగులేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. ఇంట్లో సందడి చేస్తున్న మూడేళ్ల చిన్నారికి చెక్క బీరువా రూపంలో మృత్యువు ఎదురైంది. ఆడుకుంటూ బీరువాను పట్టుకున్న చిన్నారిపై ప్రమాదవశాత్తు అది పడిపోయి ఆమె తీవ్రంగా గాయపడింది.
చెక్క బీరువా పడి మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు గంట వరకు రాని అంబులెన్సు.. దారిలోనే మృతి
కాకినాడ జిల్లా కొత్తపల్లి : బుడిబుడి అడుగులేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. ఇంట్లో సందడి చేస్తున్న మూడేళ్ల చిన్నారికి చెక్క బీరువా రూపంలో మృత్యువు ఎదురైంది. ఆడుకుంటూ బీరువాను పట్టుకున్న చిన్నారిపై ప్రమాదవశాత్తు అది పడిపోయి ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలో ఉండగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించేందుకు చేసిన ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. దారిలో జగన్ జన్మదిన వేడుకలతో కొంత ఆలస్యమైంది. పీహెచ్సీకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి కాకినాడ తరలించేందుకు 108 అంబులెన్సు గంట వరకు రాకపోవడంతో చిన్నారి మరణించింది. ఈ ఘటనతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉప్పాడకు చెందిన రత్నప్రకాశ, జోగి ఫణికుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె జెట్సీ జయకీర్తన (3) శనివారం ఇంట్లో ఆడుకుంటూ చెక్క బీరువాను పట్టుకోగా అది ఆమెపై పడిపోయింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు బీరువాను తొలగించి, అపస్మారకస్థితిలో ఉన్న బాలికను కొత్తపల్లి పీహెచ్సీకి తరలించేందుకు బయలుదేరారు. దారిలో వాకతిప్పలో జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న వైకాపా నాయకుల హడావుడితో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో తండ్రి ఫణికుమార్ ఆమెను భుజాన ఎత్తుకుని కొద్దిదూరం పరుగులు తీశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై కొత్తపల్లి పీహెచ్సీకి చేరుకున్నారు. పాపను పరీక్షించిన వైద్యులు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి, కాకినాడ జీజీహెచ్కు తీసుకెళ్లాలని సూచించారు. 108 అంబులెన్సులో ఆక్సిజన్ ఉంటుందని, అందువల్ల వెంటనే రావాలని సమాచారం అందించినా ఆ వాహనం చేరుకోవడానికి గంటపైనే పట్టింది. అప్పటికే బాలిక పరిస్థితి విషమించి కాకినాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!