December 12, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!

ఇటీవలే సిరివెళ్లలో జరిగిన కారు దగ్థం కేసు మలుపు తిరిగింది. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని కలప స్మగ్లర్లు పని అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది?


ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు-భద్రాచలం రహదారిపై కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిరివెళ్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ దాడికి సీపీఐ(మావోయిస్ట్) సభ్యులే కారణమని మొదట పోలీసులు తెలిపారు. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారును కొంతమంది వ్యక్తులు ఆపి అందరినీ బలవంతంగా బయటకు వచ్చేలా చేశారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులు కారులో కట్టెలు నింపి నిప్పంటించారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం ఘటనపై విచారణ ప్రారంభించింది.


అయితే ఈ కేసులో ఊహించని ఓ ట్విస్టు వచ్చింది. ఎటపాక గ్రామానికి చెందిన కార్పెంటర్ గుంటుపల్లి మనోజ్, గణేష్ అనే వ్యక్తులు కలప కోసం నెల్లిపాక నుండి కారు తీసుకొని చింతూరు మండలం పేగ గ్రామానికి వెళ్లారు. సుమారు 5 దుంగలను వేసుకొని వారు తిరుగు ప్రయాణంలో సరివేల గ్రామం దాటిన తర్వాత కారుని ఆపారు. అయితే అనూహ్యంగా సీసాల్లో ఉన్న పెట్రోల్ లీకై భగ్గుమని మంటలు లేచి వాహనం దగ్ధం అయింది. ఈ ఘటనలో వారికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. పోలీసులు దగ్ధం అయిన కారు చాసిస్ నెంబర్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయంపై చింతూర్ సీఐ దుర్గప్రసాద్ స్పందించాడు. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని ఆయన స్పష్టం చేశాడు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Also Read



Related posts

Share via