December 12, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Tirumala: తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోంది.


తిరుమలలో ఇటీవల తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం సమీపంలో కొందరు చేస్తున్న హడావిడితో చాలామంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా ఫోటో షూట్‌లు చేస్తున్న ఘటనలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో.. తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ పరిసరాల్లో వీడియోలు, ఫొటోలు తీయడంపై నిషేధం విధించింది. అలిపిరి దాటిన తర్వాత షూటింగ్‌లకు నో పర్మిషన్ అని స్పష్టం చేసింది. ఆలయం ఎదుట ఫొటోలు, వీడియోలు తీయకుండా చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయం ముందు రీల్స్‌ తీసేవారిపై నిఘాను పెంచింది.

ఇక.. టీటీడీ ఆదేశాలతో విజిలెన్స్ సిబ్బంది ఆలయం దగ్గర తనిఖీలను ముమ్మరం చేశారు. శ్రీవారి ఆలయం ముందు ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీస్తున్న భక్తులను అడ్డుకున్నారు. మొబైల్స్‌లో వీడియోలు, ఫొటోలు తీస్తున్న కొందరు భక్తులను ప్రశ్నించారు. కొందరు రీల్స్‌ తీస్తున్నట్టు అనుమానం రావడంంతో వారి మొబైల్స్‌ను చెక్‌ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమలలో ఎలాంటి వీడియోలు తీయడానికి వీల్లేదని విజిలెన్స్ అధికారులు సూచించారు. ఇకపై విజిలెన్స్‌ తనిఖీలు రోజూ కొనసాగుతాయన్నారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు టీటీడీ నిఘా, విజిలెన్స్‌ తనిఖీలు గమనించాలని.. ఎలాంటి తప్పులు చేయొద్దని తెలిపారు. మొత్తంగా.. తిరుమలలో ఇటీవల వరుస వివాదాలు జరగడం.. పలువురు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహిస్తోంది

Also read

Related posts

Share via