February 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు – ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్

పీడీఎస్ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తనిఖీలు – 1064 టన్నుల బియ్యం సంచులను పరిశీలించిన పవన్‌కల్యాణ్, మంత్రి నాదెళ్ల మనోహర్

తనిఖీల అనంతరం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత అయిదేళ్లలో కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారని, తాము వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామన్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు వెయ్యి లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారని తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బియ్యం అక్రమ రవాణాను గతంలో డ్రోన్‌ ద్వారా చిత్రీకరించామని పవన్ కల్యాణ్ అన్నారు.

పోర్టు అధికారులు సహకరించలేదు:కాకినాడ పోర్టు నుంచి సరకుల ఎగుమతులు జరగాలని, అక్రమాలు జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారులు తనకు కూడా సహకరించలేదని, బియ్యం అక్రమ రవాణాపై డీప్‌ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆరోపించారు. బియ్యాన్ని కొన్ని దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని పవన్ తెలిపారు. మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నామన్న పవన్, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం అక్రమ రవాణాలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో అక్రమ వ్యాపారం జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు

కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా: కాకినాడ పోర్టు అధికారులు కూడా సరిగా సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికి సముద్రతీరం చాలా లాభదాయకమని పవన్ అన్నారు. సముద్రతీరం ఎంత లాభమో, అంత నష్టం కూడా ఉందని, మన తీరప్రాంతాల్లో మారిటైమ్ భద్రత సరిగా లేదని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలన్న పవన్, కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోందని వెల్లడించారు. రేషన్ బియ్యం వేలమందికి ఉపాధిగా మారిందని, కోర్టులకు వెళ్లి తన పైనే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.

వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు: కిలో

రేషన్ బియ్యాన్ని రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని పవన్ అన్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలు, అవినీతిని అరికడతామన్న పవన్, పారదర్శక పాలన అందిస్తామని ప్రజలకు మాటిచ్చామని గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, సీఐడీ, సీబీఐ, ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామని స్పష్టం చేశారు. కాకినాడ యాంకర్ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని, ఓడలోకి వెళ్లకుండా తననే అడ్డుకున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందని అన్నారు.

ఈ ఎగుమతులు సక్రమంగా జరిగితే రాష్ట్ర ఖజానాకు డబ్బు వచ్చేదని, రేషన్ బియ్యం నిల్వలపై ప్రతి జిల్లాలో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ఎగుమతులు ఆపితే కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని అంటున్నారని, తనిఖీలకు వెళ్లకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టులో 10 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారని అంటున్నారని, కార్మికులు ఉపాధి కోల్పోకుండా చూడటం ఎలా అని ఆలోచిస్తున్నామని అన్నారు.

Also read

Related posts

Share via