SGSTV NEWS
Andhra PradeshCrime

బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు

• అవ్వతాతలపై మనవరాలి ఫిర్యాదు

• సర్టిఫికెట్లు ఇప్పించాలని ఎస్పీకి వినతి



పుట్టపర్తి టౌన్: అవ్వతాత చేస్తున్న బలవంతపు పెళ్లి ప్రయత్నాల నుంచి తనను కాపాడి ఉన్నత చదువులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్న వద్ద ఓ విద్యార్థిని మొరపెట్టుకుంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్య వేదికలో ఎస్పీని కనగానపల్లికి చెందిన విద్యార్థిని సాయి కలసి వినతి పత్రాన్ని అందజేసింది. బాధితురాలు తెలిపిన మేరకు… కనగానపల్లికి చెందిన చెన్నప్పకు ముగ్గురు కుమార్తెలున్నారు. తండ్రి అవిటివాడు కావడంతో తాత పాపన్న, అవ్వ వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అక్కచెళ్లెళ్లు చదువులు కొనసాగించారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించిన సాయి… ఇంటర్లో లో 950 మార్కులతో టాపర్గా నిలిచింది.

డిగ్రీ కళాశాలలో చేరాలని అనుకుంటుండగా అవ్వ, తాత, ఇతర కుటుంబసభ్యులు తన సర్టిఫికెట్లు లాక్కొని బలవంతంగా బంధువుల అబ్బాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తల్లిదండ్రలు సైతం ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారు. సర్టిఫికెట్లు ఇప్పించి తన విద్యాభ్యాసానికి మార్గం సుగమమం చేయడంతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఎస్పీని బాధితురాలు వేడుకుంది. స్పందించిన ఎస్పీ తక్షణమే సంబంధిత పీఎస్ సీఐతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వయిజర్ సాయినాథెడ్డి, ఎస్ బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts