ఒక తల పాము కాదు…రెండు తలల పాము… బాత్రూంలోకి వెళ్లగానే కనిపించేసరికి గుండె ఆగినంత పనైంది. కాసేపు ఒళ్లంతా చెమటలు పట్టాయి. గట్టిగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగువారికి చెప్పారు. వారు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఆ తర్వాత…..
విశాఖ సీతమ్మధారలో కనిపించిన వింత పాము కలకలం రేపింది. కొండవాలు ప్రాంతంలో ఓ ఇంట్లోని బాత్రూంలోకి పాము ప్రవేశించింది. వాష్ రూమ్ వినియోగించేందుకు వెళ్లగా.. లోపల కనిపించిన పామును చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దాన్ని రంగు, రూపు చూసి.. రక్తపింజర అని.. కొండ చిలువ పిల్ల అని భావించి… స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చేతులతోన ఆ పామును రెస్క్యూ చేశారు. దాన్ని స్థానికంగా రెండు తలల పాముగా పిలుస్తారని.. దాని శాస్త్రీయ నామం శాండ్ బోవాగా చెప్పారు. దానితో ఎలాంటి ప్రాణహాని ఉండదని.. అలాంటి పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఒక పాముకు రెండు తలలు ఉంటాయా..?
ప్రపంచంలో వేలాది రకాల జీవులు, జలచరాలు ఉంటాయి. వాటిలో జాతులు కూడా ఉన్నాయి. అయితే.. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నీటిలో ఉండే జీవుల మాట పక్కన పెడితే.. భూమిపై నివసించే జీవుల్లో పాముల విషయమే వస్తే కొన్ని విషపూరితంగా ఉంటే మరికొన్ని మనిషికి హాని కలిగించేంత విషం వాటికి ఉండదు. వాటిలో ఒకటి సాండ్ బోవా స్నేక్. రెండు తలల పాముగా ప్రచారంతో ప్రసిద్ధి చెందింది. దీంతో మనిషికి ఎటువంటి ప్రాణహాని ఉండదు. సాధారణ ఇసుక బోవా ను రఫ్-టెయిల్డ్ బోవా అని కూడా పిలుస్తారు. దీనికి తల ఎలా ఉంటుందో తోక భాగం కూడా అదే మాదిరిగా కనిపిస్తుంది. అందుకే చాలామంది దీనికి రెండు తలపాముగా అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఈ పాముకి ఒకే తల ఉంటుంది రెండో తల ఉండదు. ఈ పాము విషం లేనిది. భారత ఉపఖండం అంతటా కనిపిస్తుంది.
ఇసుక బోయలు, కొండ ప్రాంతాల్లోనే మట్టిలో ఇది జీవనం సాగిస్తోంది. ప్రమాదకరం కానివి ఈ పాములు. నెమ్మదిగా కదిలే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పాము సగటు పొడవు 75 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మించి..
సాండ్ బోవాను చూపించి చాలామంది మంత్రగాళ్లు, మోసగాళ్లు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మూఢనమ్మకాలతో బురిడీ కొట్టించి క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీని తలా తోకబాగం ఒకే మాదిరిగా కనిపించడంతో రెండు తలల పాముగా జనాన్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఆ పాముకు అతేంద్రియ శక్తులు ఉంటాయని.. ఆ పాము ఇంట్లో ఉంటే కనక వర్షం కురిపిస్తుందని నమ్మిస్తూ ఉంటారు. కనీసం ఆ పామును తాకిన అదృష్టం వరిస్తుందని చెప్పి జనాలను మభ్యపెడుతూ ఉంటారు. ఆరు నెలలు ముందుకి ఆరు నెలలు వెనక్కి పాకుతూ ఉంటుందని కూడా చెప్పడం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అందుకే దీనికి భారీ రేటు పెట్టి అనధికారికంగా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇటీవల చాలా చోట్ల స్మగ్లింగ్ చేస్తూ కోట్లలో ధర పెట్టి అమ్మకానికి సిద్ధపడుతూ చాలా సందర్భాల్లో ముఠాలో పట్టుపడ్డాయి. ఈ పాముకు రెండు తలలు ఉండవని.. అపోహలు నమ్మొద్దని.. ఇటువంటి పాములు ఎక్కడైనా కనిపిస్తే ప్రాణహాన్ని తలపెట్టకుండా సమాచారం ఇవ్వాలని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్.
రాతి బొరియలు ఇసుక నెలలో జీవించే ఈ పాము.. చిన్న ఎలుకలు, బల్లులు చిన్న పక్షులు తిని జీవిస్తుంది. ఈ బోయాస్ జాతికి చెందిన పాములు సాధారణంగా 2 నుంచి 4 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాలు మినహా భారత ఉపఖండంలోని చాలా లోతట్టు ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. ఆడ పాము పిల్లలకు జన్మనిస్తుంది. ఐదు నుంచి 20 వరకు పిల్లలను పెడుతుంది. విదేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. లైంగిక సామర్థ్యం పెంచే శక్తి ఉందని, ఔషధల తయారైకి ఉపయోగపడుతుందని నమ్మించి ముఠాలో సొమ్ము చేసుకుంటున్నాయి. దీనినే తోక భాగానికి రంగు వేసి రెండు తలల పాము అని కొంతమంది, రెండు వైపులా కదలే శక్తి దానికి ఉందని చెప్పి డబ్బులు ఇంజన్ పాము అని కూడా సాండ్ బోవాను పిలుస్తూ ఉంటారు. అటువంటి అపోహలు ఎవరు నమ్మొద్దని.. కేవలం పాముకు ఒక్కతల మాత్రమే ఉంటుందని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్. అయితే కొండచిలువ, రక్తపింజరను ఈ సాండ్ బోవ పాము పోలి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది.. సాండ్ బోవా అనుకుని రక్తపింజరని పట్టుకొని కాటుకు గురూ ప్రాణాల పైకి తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయని అన్నారు. అందువల్లే పామును జాగ్రత్తగా గమనించి గుర్తించి.. వాటిని రెస్క్యూ చేసే వారికి మాత్రమే చెప్పాలని.. పట్టుకునే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్.
అరుదైన, అంతరించే దశలో ఉన్న ఈ పామును బంధించడం నేరమని అటవీ శాఖ వారు చెప్పారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు కంప్లైంట్ చేయాలన్నారు.
Also read
- లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
- పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
- Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
- Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..
- Annapurna Jayanti 2024: అన్నపూర్ణ జయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి..