November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

తిరుమల పర్యటనను అడ్డుకున్నారు : వైఎస్ జగన్



తాడేపల్లి: తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసిపి అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైసిపి  నేతలకు నోటీసులిచ్చి తిరుమల పర్యటనను అడ్డుకున్నారని ఆగ్రహించారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారని, వేలాది మంది పోలీసులను మోహరించారని తెలిపారు. మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే దళితులను ఆలయానికి పోనిస్తారా? రానిస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పాపాలు ప్రజలపై పడకుండా ఊళ్లలో ప్రత్యేక పూజలు చేయాలని  వైసిపి నేతలకు జగన్‌ పిలుపునిచ్చారు.

ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్ల జరపడం దశాబ్ధాలుగా జరుగుతూ ఉంది. ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తెచ్చిన ప్రతి ట్యాంకర్‌ ను కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. చంద్రబాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. తమ హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపామన్నారు. లడ్డూ తయారీ పదార్ధాల నాణ్యతను తనిఖీ చేసే ఇంత గొప్ప వ్యవస్థ తిరుమలలో ఉందని జగన్‌ వివరించారు.

లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ తెరపైకి తెచ్చారని జగన్ అన్నారు. ‘‘నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. నా మతం మానవత్వం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతా. బయటకు వెళ్తే  అన్ని మతాలను గౌరవిస్తా. హిందుమత ఆచారాలను పాటిస్తా. ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తా. నా మతం ఏమిటని అడుగుతున్నారు. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి. ఎన్డీఏ కూటమిలోని బాబు లడ్డూను విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు

Also read

Related posts

Share via