November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: మితిమీరుతున్న యువత ఆగడాలు.. పట్టపగలు నడిరోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు!



రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. చేతిలో బైక్, సెల్ ఫోన్ ఉంటే చాలు మాకే అంతా తెలుసంటూ చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో పని లేకుండా బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ కాలంలో చాలా జరుగుతుండగా, అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనం చూసే ఉన్నాం. అలాంటి మరో ఘటనే ఇది కూడా. దీని పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరం పాతబస్తీ పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక వాళ్లే ఏదైనా వేరే లోకంలో విహరిస్తున్నారో తెలియదు గానీ నడిరోడ్డు మీద ఉన్నామనే ధ్యాసే లేకుండా ప్రవర్తించారు. బైక్ నడుపుతున్న అబ్బాయి ఒడిలోనే కూర్చుంది అమ్మాయి ఏకంగా. అలా పట్టపగలు రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు. ఇది చూసి అక్కడ ఉన్నవారు సిగ్గుతో తల దించుకోక తప్పలేదు. అసలు ఏమైంది ఈ సమాజానికి అంటూ తిట్టుకోక తప్పలేదు. ఇలాంటి వికృత చేష్టలను చూసి సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలు కూడా అడగకుండా పిల్లలను పంపడం సరికాదంటున్నారు. ఇలాంటి ఘటనలతో రేపు పిల్లలు పెద్ద ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోదు అని హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఇలా నడిరోడ్డుపైనే బైకుల మీద వెళ్తూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న జంటలు చాలానే కనపడుతున్నాయి. వీరి ఆగడాలను అరికట్టడానికి పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వెహికల్ నెంబర్ ఆధారంగా వేల కొద్దీ సీసీ కెమెరాలను పోలీసులు స్కాన్ చేస్తున్నారు. తద్వారా ఇలా ప్రవర్తిస్తున్న యువతను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలా వికృత చేష్టలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఇంట్లో తల్లిదండ్రులు కూడా కాస్త ఇలాంటి వాటిపై దృష్టి సారించి, పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు కోరుతున్నారు.

Also Read

Related posts

Share via