SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: మామూలోడు కాదు.. ఆమె మంగళ సూత్రంపైనే కన్నేశాడు.. చివరకు..

సాధారణంగా రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు జరిగినప్పుడు పిక్ పాకెటర్స్ గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం చూపిస్తుంటారు. భారీగా తరలివచ్చిన అభిమానులు తమ నేతలను చూసే ఆత్రుతలో ఉండగానే జేబు దొంగలు తమ చేతికి పనిచెబుతుంటారు. ముఖ్య నేతల పర్యటనల సమయంలో ఇటువంటి చోరీలు జరుగుతుంటాయి. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. చాలామంది జేబులు ఖాళీ అయిన తర్వాత లబోదిబోమంటుంటారు. అయితే, గుంటూరులో దొంగలు మాత్రం ఏకంగా మంగళ సూత్రంపైనే కన్నేశారు. నిన్న గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు మాజీ సిఎం జగన్ వచ్చారు. దీంతో అభిమానులు భారీగానే హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు కూడా జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెదకాకాని మండలం కంతేరు నుండి మహిళలు జిల్లా జైలు వద్దకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు.

జగన్ వస్తున్నారని తెలియగానే అందరూ అటు వైపు దృష్టి సారించారు. అయితే, అదే సమయంలో ప్రేమ కుమారి అనే మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని ఒక యువకుడు లాగాడు. వెంటనే మహిళ అప్రమత్తమైన మహిళ.. ఆ యువకుడి చేయిని పట్టుకుంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తన మెడలోని బంగారు చెయిన్ అపహరించేందుకు యత్నించాడని మహిళ ఫిర్యాదు కూడా చేసింది.



మరో వైపు జగన్ జైలు నుండి బయటకు వస్తున్న సమయంలో ఒక అభిమాని పర్సు కొట్టేసేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. అతణ్ని పట్టుకున్న అభిమాని పక్కనే ఉన్న పోలీసులకు అప్పగించాడు. జైలు ప్రాంగణంలోనే అరండల్ పేట పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీసులు ఉంటారన్న సంగతి తెలిసినా పిక్ పాకెటర్స్ మాత్రం తమ చేతులను పనిచెప్పడం మానుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా పర్స్ లు కొట్టేస్తుంటారని, అయితే.. మొదటిసారి మహిళ మెడలోని చెయిన్ కొట్టేసే ప్రయత్నం చేయడం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు, ముఖ్య నేతల పర్యటనలకు వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు

Also read

Related posts