చంద్రగిరి(తిరుచానూరు): అనుమానం పెనుభూతమై వారి కాపురాన్ని ఛిద్రం చేసింది. కట్టుకున్న దాన్ని కర్కశంగా గొంతు కోసి హతమార్చేందుకు ప్రేరేపించింది. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం మంగళంలో భార్యను చంపేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఘటన సంచలనంగా మారింది. వివరాలు.. మంగళం క్వార్టర్స్ కు చెందిన రమేష్, తిరుపతి ఎస్టీవీ నగర్కు చెందిన రూపావతికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెలు చందనప్రియ, కుందన ప్రియతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా రమేష్కు తన భార్యపై అనుమానం పెరిగింది. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో 10 రోజుల క్రితం రూపావతి పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్లిపోయింది.
పండుగ కోసం ఇంటికి తీసుకొచ్చి..!
అత్తగారింటికి వెళ్లిన భార్యను పండుగగా తీసుకురావాలని గురువారం రమేష్ తన తండ్రి, తమ్ముడితో కలసి ఎస్టీవీ నగర్కు వెళ్లాడు. ఇకపై ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగవని, పిల్లలను, భార్యను పోషించుకుంటామని చెప్పి మంగళం క్వార్టర్స్లోని ఇంటికి తీసుకువచ్చాడు. శుక్రవారం వేకువజామున రమేష్ ఫూటుగా మద్యం తాగి ఇంటికి వెళ్లి మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహం పట్టలేక గదిలో నుంచి ఇద్దరు పిల్లలను బయటకు పంపించి, గడియ పెట్టాడు. పిల్లలు కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోని కత్తి తీసుకుని రూపావతి గొంతు కోసి హతమార్చాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకుని, గది తలుపులు తీసి, పిల్లల వద్దకు వచ్చి మీ అమ్మ చనిపోయిందంటూ కేకలు వేశాడు. అక్కడ నుంచి నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
అనుమానంతోనే హతమార్చాడు : అడిషనల్ ఎస్పీ
భార్యపై అనుమానంతోనే రమేష్ హతమార్చాడని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్తో కలసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
తాజా వార్తలు చదవండి
- Bus Fire: గాడ నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!
- ప్రేమించిన వ్యక్తిని మరువలేక.. యువతి ఆత్మహత్య
- అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్చల్
- Mahabharat: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
- Garuda Puranam: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?





