April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kurnool: కర్నూలు జిల్లాలో తెదేపా నేత దారుణహత్య

కర్నూలు జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యాడు.

పత్తికొండ: కర్నూలు జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా నేత వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్లెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తెదేపా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపాకు చెందిన వారే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసును త్వరగా ఛేదిస్తాం: డీఎస్పీ

శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా కేసును కొలిక్కి తెస్తామన్నారు. శ్రీనివాసులుకు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు తెలిపారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు.

Also read

Related posts

Share via