SGSTV NEWS online
CrimeTelangana

Peddapur Gurukul: గురుకుల పాఠశాలలో వరుస పాముకాట్లు.. మహిళకు పూనకం! బడిలో గుడి కట్టాలంటూ సందేశం

జగిత్యాల, ఆగస్టు14: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఇటీవల వరుస పాముకాట్లు సృష్టించాయి. పాముకాట్లతో ఇప్పటికే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రిన్సిపాల్ కె విద్యాసాగర్‌ను సస్పెండ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో ఓ మహిళకు బుధవారం (ఆగస్టు 14) పూనకం వచ్చింది. తాను నాగదేవతనని, ఈ పాఠశాలలో తనకు తావు దొరకక తిరుగుతున్నానని చెప్పింది. తనకు వెంటనే గుడి కట్టించాలని, లేకపోతే ఇలాంటి పాముకాట్లు మళ్లీ పునరావృతమవుతాయని హెచ్చరించింది.


ఇప్పటికే పెద్దాపూర్ గురుకుల స్కూల్లో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తుండటంతో.. తాజాగా మహిళ పలికిన మాటలు విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ఈ గురుకుల పాఠశాలలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. జూలై 27న పాముకాటుకు గురై ఆరో తరగతి విద్యార్ధి అనిరుధ్‌ మరణించాడు. ఆ ఘటనను మరువకముందే గత శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మోక్షిత్, హేమంత్ యాదవ్ అనే ఇద్దరు విద్యార్థులను పాము కాటేసింది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుధ్‌ మృతి చెందాడు. దీంతో ఇప్పటి వరకు ఇద్దరు విద్యార్ధులు మృతి చెందినట్లైంది. విద్యార్థి మోక్షిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

డాక్టర్ కె సంజయ్ మాట్లాడుతూ.. ఫుడ్‌పాయిజన్‌ లక్షణాలు లేకపోవడంతో బాలురు పాముకాటుకు గురై ఉండవచ్చని తెలిపారు. విద్యార్థులకు యాంటీ-వెనమ్ ఇంజక్షన్ ఇచ్చి పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. పదేపదే పాముకాటు ఘటనలు జరిగినా విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని డాక్టర్ సంజయ్ తెలిపారు.

Also read

Related posts