Sri Yama Dharmaraja Temple Dharmapuri : నరకాధిపతి, సూర్య పుత్రుడు అయిన యమ ధర్మరాజుకు దేశంలోనే అరుదుగా అక్కడక్కడా మాత్రమే ఆలయాలున్నాయి. అంతేకాదు యమద్వితీయ రోజు యమధర్మరాజు ఆలయాన్ని సందర్శిస్తే, అకాల మృత్యు దోషాలు తొలగి దీర్ఘాయుష్షు కలుగుతుందని శాస్త్ర వచనం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రంలో వెలసిన ఒక యమధర్మరాజు ఆలయ విశేషాలు మీకోసం!
యమ ద్వితీయ ఎప్పుడు?
న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజు తన సోదరి ఇంటికి భోజనానికి వెళ్లే భగినీ హస్త భోజనం లేదా యమ ద్వితీయ దీపావళి తర్వాత రెండు రోజులకు వస్తుంది. ఈ రోజు అన్నదమ్ములు తమ సోదరి ఇంటికి చీర సారెలతో వెళ్లి ఆప్యాయంగా సోదరి చేతి భోజనం తినడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అక్టోబర్ 23, గురువారం యమద్వితీయ సందర్భంగా మనకు సమీపంలో ఉన్న యమ ధర్మరాజు ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
ధర్మపురి
యమధర్మరాజు ధర్మానికి ప్రతినిధి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో యమధర్మరాజుకు ప్రత్యేక ఆలయం ఉంది. ధర్మాన్ని పేరులోనే నిలుపుకున్న ధర్మపురిలోనే యమధర్మరాజుకు ప్రత్యేక ఆలయం వెలిసి ఉండడం విశేషం. 18 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ధర్మపురి నరసింహస్వామి ప్రధాన ఆలయానికి ముందు భాగంలో ఉంటుంది.
ధర్మపురి ప్రత్యేకత
ధర్మపురి పేరు వింటేనే రెండు విశిష్ఠతలు గుర్తుకొస్తాయి. మొదటిది ఇక్కడ దక్షిణాభిముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి అయితే, రెండవది మహిమాన్వితమైన నారసింహుడి క్షేత్రం. పూర్వం బ్రహ్మది దేవతలు, ఋషులు, మునులతో కలిసి ధర్మపురిలో ఎక్కడా లేనివిధంగా దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరిలో స్నానమాచరించి, ఆ యోగ నారసింహుడి దర్శనంతో పునీతులయ్యారని పురాణాలలో వివరించి ఉంది.
యముని తీర్థయాత్రలు
నిత్యం నరకానికొచ్చే పాపులను చూస్తూ, వారు చేసిన నేరాల గురించి వింటూ, వారికి వివిధ రకాల శిక్షలు విధిస్తూ, మనశ్శాంతి కరువైన యముడు వాటన్నింటి నుంచి విముక్తి పొందడం కోసం అనేక తీర్థయాత్రలు చేసాడు. చివరగా ధర్మపురి విశిష్టత తెలుసుకుని ఇక్కడకు చేరుకొని పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి నరసింహస్వామిని దర్శించుకున్నాడు.
ఆలయ స్థల పురాణం
ధర్మపురిలో దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరిలో స్నానం, నరసింహుని దర్శనంతో యమునికి అంతవరకూ పాపాత్ములకు శిక్షలతో పట్టుకున్న దోషాలు, మానసిక అశాంతి వంటివన్నీ దూరమయ్యాయని బ్రహ్మాండ, స్కాంధ పురాణాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం యమ ధర్మరాజు తనకు పాపవిముక్తి కలిగించమని నరసింహుని శరణు వేడుతాడు. తనను ఆశ్రయించిన యమ ధర్మరాజుని నరసింహస్వామి అనుగ్రహిస్తాడు. నరసింహుని అనుగ్రహంతో యముడు పాపవిముక్తుడవుతాడు. అనంతరం నరసింహస్వామి కరుణతో యముడు ధర్మపురిలో నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోనే వెలసినట్లు ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ విశేషాలు
యమ ధర్మరాజు ఆలయం ధర్మపురి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో దక్షిణ దిశలో వెలసి ఉంది. ఈ క్షేత్రం క్రీ.శ. 850 ప్రాంతం నుంచే ఉన్నప్పటికీ క్రీ.శ. 1422-1436 మధ్యకాలంలో బహమనీ సుల్తానుల దాడిలో ఈ ఆలయం ధ్వంసం అయినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం 17 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా తెలుస్తోంది. యముడు గోదావరిలో స్నానం ఆచరించిన ప్రదేశాలకు యమగుండాలు అని పేరు వచ్చింది. ఈ యమ గుండాలలో స్నానం చేస్తే ఎటువంటి మొండి రోగాలైనా నయమవుతాయని విశ్వాసం.
భీకరాకరంలో యముని విగ్రహం
నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన యముని ఆలయంలో యమధర్మరాజు విగ్రహం చతుర్భుజాలతో, పెద్ద పెద్ద కోరలతో, చేతులో యమదండంతో భీకరాకరంలో కనిపిస్తుంది. పురాణాల ప్రకారం యముడు అష్ఠ దిక్పాలకులలో ఒకడిగా దక్షిణ దిక్కుకు అధిపతిగా వ్యహరిస్తుంటాడు. యముని భక్తికి మెచ్చిన నరసింహుడు తన దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా యముని దర్శించిన తర్వాతనే తనను దర్శించుకుంటారని వరం ఇచ్చాడంట! ఈ క్రమంలో ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదనే నానుడి స్థిరపడింది.
పూజోత్సవాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భరణి నక్షత్రానికి యముడు అధిపతి అని తెలుస్తోంది. కాబట్టి ప్రతి మాసం భరణి నక్షత్రం రోజు యమ ధర్మరాజుకు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు జరుగుతాయి. ఈ హోమాల్లో పాల్గొంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
యమ ద్వితీయ
దీపావళి తరువాత రెండు రోజులకు వచ్చే యమ ద్వితీయ రోజు కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. యమ ద్వితీయ రోజు యమ ధర్మరాజు నరక ద్వారాలు మూసేసి తన సోదరి ఇంటికి వెళ్లి ఆమె ఆతిధ్యాన్ని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు మరణించిన వారికి నరక ద్వారాలు మూసి ఉంటాయి కాబట్టి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అందుచేత వివిధ రాష్ట్రాల ప్రజలు యమ ద్వితీయ రోజు ధర్మపురి చేరుకొని తమకు మోక్షం, స్వర్గలోకాన్ని ప్రసాదించమని యముని వేడుకుంటారంట!
దీర్ఘాయుష్షు
ధర్మపురిలో యమ ధర్మరాజు విగ్రహం చెంత ఉన్న గండ దీపంలో నూనె పోసి, స్వామిని దర్శిస్తే, దీర్ఘకాలంగా పీడించే శారీరక రుగ్మతల నుంచి విముక్తి పొంది దీర్ఘాయుష్షు కలుగుతుందని విశ్వాసం. రానున్న యమ ద్వితీయ రోజు మనం కూడా ధర్మపురిలో యమ ధర్మరాజు ఆలయాన్ని దర్శిద్దాం. అపమృత్యు దోషాలు తొలగించుకుని దీర్ఘాయుష్షును పొందుదాం.
