April 17, 2025
SGSTV NEWS
Spiritual

నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు? దీని పౌరాణిక ప్రాముఖ్యత ఏంటి?



దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అందులో భాగంగా రెండో రోజు నరక చతుర్దశి నిర్వహిస్తారు. ఇది జరుపుకోవడం వెనుక ఉన్న కథ, ప్రాధాన్యత గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్తలు వివరించారు.

నరక చతుర్దశి
నరక చతుర్దశి పండుగ, దీపావళి పర్వదినాల్లో రెండో రోజుగా జరుపబడుతుంది. ఈ పర్వదినం చెడు శక్తులపై విజయాన్ని, అంధకారం నుంచి వెలుగుకు మార్పును సూచిస్తుంది.

నరక చతుర్దశికి సంబంధించిన పౌరాణిక విశేషాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు వివరించారు. ఈ పర్వదినం కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా మన జీవనంలో శుభాన్ని, ధర్మాన్ని, క్షేమాన్ని కోరుకునే పవిత్ర సందర్భం.

నరక చతుర్దశి పౌరాణిక కథ
పురాణ కథల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు భూమిలో ప్రజలను తీవ్రంగా హింసించాడని చెబుతారు. అతను దేవతలను అవమానించడమే కాకుండా, వారి శక్తులను దుర్వినియోగం చేశాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరినప్పుడు, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహారం చేశాడు. ఈ విజయాన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే తైలాభ్యంగ స్నానాన్ని (నూనె స్నానం) చేయడం ద్వారా కాయిక, మానసిక కల్మషాలను తొలగించవచ్చని నమ్ముతారు.

నరక చతుర్దశి రోజున లక్ష్మీ దేవిని పూజించడం సంప్రదాయం. మహాలక్ష్మి పూజ ద్వారా ధనం, ఐశ్వర్యం, శాంతి, సంతోషాలను ఆహ్వానిస్తారు. పూజలో దీపాలను వెలిగించడం ద్వారా చెడు శక్తులు దూరమవుతాయని నమ్ముతారు. ఇల్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించడం ద్వారా, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని విశ్వసిస్తారు

తైలాభ్యంగ స్నానం
ఈ రోజున తెల్లవారుజామున నూనె స్నానం చేయడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. ఇది శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతిని ఇస్తుందని నమ్ముతారు.

లక్ష్మీ పూజ
ఇంటిని శుభ్రంగా ఉంచి, దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారు. పూజలో పసుపు, కుంకుమ, పుష్పాలు, నైవేద్యాలు ఉపయోగిస్తారు.

దీపాలను వెలిగించడం
చీకటిని తొలగించడానికి ఇంటి బయట యమ దీపం వెలిగిస్తారు. ఇది అకాల మరణాన్ని నివారించడమే కాకుండా, కుటుంబానికి శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు. నరక చతుర్దశి శ్రద్ధా విశ్వాసాలుఈ పండుగలో కేవలం అర్చనలు మాత్రమే కాకుండా, లోక కల్యాణం కోసం మంచి ఆలోచనలను ఆచరించడం ఎంతో ముఖ్యమైనది. చెడు శక్తులపై మంచి శక్తుల విజయం సాధ్యమని, ధర్మమే ఎల్లప్పుడూ నెగ్గుతుందనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. తైలాభ్యంగ స్నానం, లక్ష్మీ పూజ ద్వారా శుభం, క్షేమం, ఆరోగ్యాన్ని పొందవచ్చని నమ్ముతారు.

నరక చతుర్దశి పండుగలో దాగి ఉన్న సందేశం ధర్మబద్ధమైన జీవనం వైపు మిమ్మల్ని తీసుకెళ్లడమే. లక్ష్మీ పూజతో పాటు యమదీపం వెలిగించడం మన జీవితాల్లో శ్రేయస్సును, సంతోషాన్ని తీసుకువస్తుంది. ఈ పండుగ ద్వారా చెడును తొలగించి, సత్యం, ధర్మాన్ని ఆచరించాలని సంకల్పం చేయాలి.

Related posts

Share via