దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు.వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు,ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
ఈ దీపావళి శరదృతువులో రావడం చేత విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.
అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు.తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని,సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు.తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాథిపతీ “నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
నరక చతుర్దశి
కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది.నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు.అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి.
మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.నరకుని చెరనుండి సాధుజనులు,పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.
రామాయణం గురించి మీరు వినే ఉంటారు.అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు.
ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు.ఆరోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది.దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు.ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.
Also read :
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా..! ఈ సమయంలో కొన్ని వస్తువులు కనిపిస్తే శుభ్రప్రదం.. అనుకోని విధంగా డబ్బులు కలిసి వస్తాయట
ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని తెలుసుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు.ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.
మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం.మరణాన్ని దరి చేరని అమృతం కోసం దేవ,దానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది.సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.
నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం.కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు.ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
Also read :Diwali 2024: దీపావళికి ముందే మీ ఇంట్లో శంఖాన్ని తీసుకొస్తే.. ధనలక్ష్మి విడిచి పోదు..
ఐదవ వృత్తాంతంగా రైతుల గురించి తెలుసుకుందాం.గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు.మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.