April 18, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఇంట్లోకి దూరాడు.. సర్వం సర్దేశాడు.. కానీ చివరకు.. ఇదేం ట్విస్ట్!?

విశాఖపట్నంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విశాఖపట్నం మల్కాపురం ఆదర్శ రాయల్ విద్యాలయ సమీపంలోని ఓ ఇంటిలోకి దొంగ ప్రవేశించాడు. ఇంట్లోకి చొరబడిన దొంగ.. చెక్క బీరువా పగలగొట్టి అందులోని నగలు, నగదు కాజేశాడు. ఇక తిరిగి బయల్దేరి క్రమంలో ఇంటి యజమాని కంట్లో పడ్డాడు. ఇంటి ఓనర్ గట్టిగా కేకలు వేయటంతో ఏం చేయాలో పాలుపోక చోరీ సొత్తు అక్కడే వదిలేసి రేకుల షెడ్‌లోకి దూరి పరారయ్యాడు. ఈ ఘటనలో దొంగ గాయపడినట్లు తెలిసింది.


నిత్యం మన ముందు అనేక ఘటనలు జరుగుతుంటాయి. కొన్నింటిని చూస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. కొన్నింటికి అమ్మ బాబోయ్ అనుకుంటాం. మరికొన్నింటికి మాత్రం దూల తీరింది వెధవకు అని లోలోనే అనుకుంటాం. అలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అతనో దొంగ. ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేయడం అతని వృత్తి. చోరీ చేయడానికి ముందు ఆ పద్ధతి, ఆ ప్లానింగ్ గట్రా మామూలుగా ఉండవు. ఏ ఇంటికైతే కన్నమేయాలని అనుకుంటాడో.. ఆ ఇంటి పరిసరాలలో తచ్చాడుతూ ఇంటి పరిసరాలపై ఓ అవగాహన పెంచుకుంటాడు. ఆ తర్వాత ఓ మాంఛి రోజు చూసుకుని.. చోరీకి బయల్దేరతాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం దొంగతనం చేసి అక్కడి నుంచి ఉడాయిస్తాడు.




కానీ ఎల్లకాలం మనదే ఉండదుగా. టైమ్ బ్యాడ్ అయినప్పుడు తాడే పామైనట్లు మనది కాని రోజున ఎక్కడున్నా తప్పించుకోలేం. అలాంటి పరిస్థితే మన వీర ధీరుడైన చోరుడికి వచ్చింది. పక్కా ప్లానింగ్ వేసుకుని మల్కాపురం ఆదర్శ రాయల్ విద్యాలయ పాఠశాల వద్ద ఉన్న ఓ భవనంలో చోరీకి వెళ్లాడు. భవనం మూడో ఫ్లోర్‌లో ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అత్యంత చాకచక్యంగా లోనికి ప్రవేశించిన దొంగ.. ఇంట్లో ఉన్న చెక్క బీరువా తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న రూ.2 లక్షలు నగదు, మూడు తులాల వెండి కాజేశాడు. విజయవంతంగా పని పూర్తి చేసుకున్న దొంగ.. ఇక అక్కడి నుంచి పరారయ్యేందుకు సిద్ధమయ్యాడు.


అయితే అప్పుడే మనోడి ప్లాన్ ఎదురు తన్నింది. ఇంటి యజమాని కంట్లో దొంగ పడ్డాడు. ఇంకేముంది దొంగ దొంగా అంటూ ఇంటి యజమాని కేకలు మొదలెట్టాడు. దీంతో షాక్ తిన్న దొంగకు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడి నుంచి పారిపోయేందుకు రెడీ అయ్యాడు. చోరీ చేసిన సొత్తును అక్కడే వదిలేసి బతుకు జీవుడా అంటూ కింద ఉన్న రేకుల షెడ్లోకి దూకేశాడు. పైనుంచి కిందకు దూకటంతో దొంగకు గాయాలైనట్లు తెలిసింది. అయితే ఇంటి యజమానికి దొరికితే చావబాది పోలీసులకు అప్పగిస్తారనే భయంతో గాయాలతోనే అక్కడి నుంచి పారిపోయాడు.

 
అనంతరం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగతనం చేసిన తీరును గమనిస్తే చోరీలలో అనుభవజ్ఞుడి పనేనని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు దొంగోడికి తగిన శాస్తి జరిగిందని అభిప్రాయపడుతున్నారు

Also read

Related posts

Share via