April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Visakhapatnam: యువతిని వీడియో తీసిన యువకుడు.. ఉరివేసుకొని బలవన్మరణం

పక్కింటి యువతిని వీడియో తీయడం ఆ యువకుడి పాలిట శాపమైంది. అదే ఆవేశంతో ఆ యువకుడ్ని గృహ నిర్బంధం చేసిన పక్కింటి వారూ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి.

గాజువాక, : పక్కింటి యువతిని వీడియో తీయడం ఆ యువకుడి పాలిట శాపమైంది. అదే ఆవేశంతో ఆ యువకుడ్ని గృహ నిర్బంధం చేసిన పక్కింటి వారూ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపిన యువకుడి ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. గాజువాక సీఐ పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూల్బాగ్ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు, పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు గొందేటి భాస్కరరావు (30) ఫార్మాసిటీలో ఒక కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. విశాఖలోని గాజువాక శ్రీనగర్ సమీప శ్రీరాంనగర్లో అద్దె ఇంట్లో కొద్ది నెలలుగా ఒక్కడే ఉంటున్నాడు. శనివారం ఉదయం పక్కింటి యువతిని వీడియో తీసినట్టు గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కరరావును నిలదీశారు. వీడియోను డిలీట్ చేయించి చేయి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతటితో ఆగకుండా మీ తల్లిదండ్రులను రప్పించి నీ సంగతి తేలుస్తామంటూ ఇంట్లో నిర్బంధించారు. బయట తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు కబురుపెట్టారు. వారు ఘటనా స్థలానికి వచ్చి తలుపు తీసి చూడగా గదిలోని సీలింగ్ ఇనుపరాడ్డుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని కనిపించేసరికి హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ పార్థసారథి, ఎస్ఐ నజీర్ లు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. గదిలో నిర్బంధించడం, గాయపర్చడం చట్టరీత్యా నేరమని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తమ కుమారుడిని కొట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటనకు కారణమైన అయిదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via