June 29, 2024
SGSTV NEWS
SpiritualTelangana

వైభవంగా వేములవాడ రాజన్న కళ్యాణం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరిస్వామి క్షేత్రంలో శివ కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కళ్యాణ మండపంలో ఇరుకుగా ఉండడంతో ఈసారి చైర్మన్ ఛాంబర్ ముందు ప్రత్యేకంగా కళ్యాణ వేదికను ఏర్పాటుచేసి పూలు ,అరటి తోరణాలతో అందంగా అలంకరించారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో తీర్థరాజస్వామి పూజ, దేవతార్చన ,దేవతా హోమం, వృషభ యాగం ,ద్వజారోహణం, ఎదుర్కోలు తదితర కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోలు అనంతరం శ్రీ పార్వతి ,రాజరాజేశ్వర స్వామి వార్లను పల్లకీసేవపై మేళతాళాలతో కళ్యాణ వేదిక పైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు. అభిజిత్ లగ్న సుముహూర్తమున ఉదయం 10.55 నుంచి వేద పండితులు, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వార్ల వివాహ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. వరుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి తరపున ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ,వధువు శ్రీ పార్వతి దేవి తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరకట్నంగా 551 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. స్థానాచార్యులు భీమశంకర్ శర్మ, ఇందిర దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. కళ్యాణం సందర్భంగా శివపార్వతులు తలంబ్రాలు బియ్యం సంచితో చేతిలో త్రిశూలం పట్టుకుని ఊపుతూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం పొందారు. మరికొందరు శివపార్వతులు పసుపుకొమ్మును మెడలో కట్టుకొని శివుడిని పెళ్లాడారు. స్వామివార్ల పెళ్లి జరుగుతున్న సమయంలో శివపార్వతులు ,భక్తులు, ఉత్సవమూర్తులపైన తలంబ్రాల బియ్యం చల్లి తరించారు. కళ్యాణo సందర్భంగా 77,266 రూపాయలను భక్తులు, శివపార్వతులు, ప్రజాప్రతినిధులు , నాయకులు స్వామివారికి కట్నాలు సమర్పించారు. 50 వేల మందికిపైగా తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని వసతులు కల్పించారు. కళ్యాణం అనంతరం భోజన వసతి ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఆర్టీవో రాజేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించారు. డిఎస్పి నాగేంద్ర చారి , సిఐలు శ్రీనివాస్ ,వెంకటేశ్వర్లు, డివిజన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

Also read

Related posts

Share via