ఉగాది నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులలో ఏ దేవుని ఆరాధన విశేషంగా చేయాలి? ఈ వసంత నవరాత్రులలో ఉపవాసం చేస్తే విశేష ఫలితం ఉంటుందా? నవ రాత్రులని ఎందుకంటారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Vasanta Navratri 2024: చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఆగమనం కూడా ఈ నాటి నుంచే మొదలవుతుంది. ఈ వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులని అంటారు. శిశిరంలో ఆకులు రాల్చి మోడువారిన చెట్లన్నీ వసంతం రాకతో పచ్చగా చిగుళ్ళు వేసి ప్రకృతి అంతా పచ్చగా చూడ ముచ్చటగా ఉంటుంది. మోడువారిన చెట్లకు వేసిన లేత చిగుర్లు తినడానికి వచ్చే కోయిల కూ కూ నాదాలతో ప్రకృతి మాత పరవశించి పోతుంది.పరమాత్మ మెచ్చే వసంతం
వసంత శోభకు మానవులు, పశుపక్ష్యాదులు మాత్రమే కాదు భగవంతుడు కూడా పరవశిస్తాడంట. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వసంత ఋతువు లోనే పరిపూర్ణ మానవునిగా ఈ భూమిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎలాగైతే మోడువారిన చెట్లు వసంతం రాకతో నూతన శోభతో కళకళలాడుతాయో, అలాగే అప్పటివరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయంట. అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు.
తొమ్మిది రాత్రులే ఎందుకు
సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు పేరిట జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకోవాలి? ఎనిమిది లేదా పది రోజులు జరుపుకోవచ్చు కదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ‘నవ’ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. తొమ్మిది అని ఒక అర్థం అయితే, నవ అంటే నూతన అని మరొక అర్థం కూడా ఉంది. అప్పటివరకు రాక్షస పీడతో శోకమయంగా ఉన్న లోకాలు శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవడం ఆచారంగా మారింది
నవవిధ భక్తి మార్గమే ముక్తి మార్గం!
మనకు వేదాలలో భగవంతుని సేవించడానికి సూచించిన భక్తి మార్గాలు తొమ్మిది. అవేమిటంటే
* శ్రవణం
* కీర్తనం
* స్మరణం
* పాదసేవనం
* అర్చనం
* వందనం
* దాస్యం
* సఖ్యం
* ఆత్మనివేదనం
ఈ నవరాత్రులలో వేదాలలో సూచించిన నవ విధ భక్తి మార్గాలతో పరమాత్మను సేవించడం ద్వారా ముక్తి మార్గం సులభమవుతుంది. ఇందుకు ప్రతీకగానే మనం వసంత నవరాత్రులను జరుపుకుంటాం.
వసంత నవరాత్రి పూజావిధానం
వసంత నవరాత్రులను దక్షిణ భారతంలో కన్నా ఉత్తరభారత ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వసంత నవరాత్రి పూజలు చేసే వారు గురువు సమక్షంలో దీక్ష స్వీకరించి దీక్ష వస్త్రాలను ధరించి ప్రతి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. దేవుని మందిరంలో అఖండ దీపాన్ని ఈ తొమ్మిది రోజులు వెలిగించి ఉంచాలి. ఉదయం సాయంత్రం దేవునికి అర్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. రోజంతా శ్రీరామ నామ స్మరణం, రాముని కీర్తనలు, భజనలు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. తొమ్మిదవ రోజైన శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం వేడుకగా చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రావణ దహనాన్ని కూడా చేస్తారు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో వసంత నవరాత్రులు జరుపుకుంటే అప్లైశ్వర్యాలు సకల విజయాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.