April 3, 2025
SGSTV NEWS
Spiritual

Ugadi New Year Name: విశ్వావసు నామ సంవత్సరం వచ్చేస్తోంది, విశ్వావసు అంటే ఎవరు? అతని కథ ఏమిటి?



Ugadi New Year Name: ఉగాదినాడు తెలుగు కొత్త సంవత్సరాది మొదలైపోతుంది. దీని పేరు విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అన్న వ్యక్తి ఎవరో అన్నది ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది.

విశ్వావసు నామ సంవత్సరం
ఉగాదినాడు కొత్త తెలుగు సంవత్సరాది మొదలైపోతుంది. ఈసారి ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలలో ఇది 39వది. క్రోథినామ సంవత్సరం పూర్తయి విశ్వావసు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ విశ్వావసు అనే పేరు గురించి ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది. విశ్వావసు అన్నది ఎవరు? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం.



విశ్వావసు ఎవరు?
విశ్వావసు అన్నది ఒక గంధర్వుడి పేరు. అతడు ఒక సంగీతకారుడిగా చెప్పుకుంటారు. ఈ విశ్వావసును కబంధుడు అని కూడా పిలుస్తారు. కబంధుడు అనేది ఒక రాక్షసుడి పేరు. గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వలన కబంధుడిగా మారాడు. కబంధుడి ప్రస్తావన రామాయణంలో వస్తుంది.

విశ్వావసు కథ ఇదే
విశ్వావసు మొదటగా ఒక గంధర్వుడని అంటారు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. అప్సరసలతో కలిసి జీవిస్తూ ఉంటారు. వేదాలు చెబుతున్న ప్రకారం 6000 కంటే ఎక్కువ మంది గంధర్వులు ఉన్నారని అంటారు. వారిలో ఒకడు విశ్వావసు. విశ్వావసు తపస్సు చేపి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని చెప్పుకుంటారు. తనకి చావు లేదని తెలిపాక విశ్వావసు అహంకారిగా మారాడని అంటారు. అహంకారిగా అయిన విశ్వావసు ఇంద్రుడి పైనే దాడి చేశారు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను, తొడలను శరీరంలోకి తోసేశాడని అంటారు. దానివల్లే తల, తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడు

విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుని వేడుకున్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చాడు. అంతేకాదు శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసు కబంధుడై జీవించసాగాడు.
రామాయణంలో కబంధుడు
అడవుల్లో ఉండే కబంధుడు అక్కడ ఉండే ఋషులను భయపడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడుకి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్లాడు. జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రాముడు, లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు. కోపంతో రాముడు అతడి చేతులను నరికి వేశాడు. కబంధుడు తన చేతులు నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు.

రాముడు అలా చేయగానే కబంధుని రాక్షసరూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో, చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వలోకానికి వెళ్లిపోయాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు.

తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి?
తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక కూడా ఒక కథను చెప్పుకుంటారు. నారదుడు ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరం ఇస్తారు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు.

తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్లా… ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం వస్తున్న విశ్వావసు సంవత్సరంతో పోలిస్తే ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని అంటారు. ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలే జరగాలని కోరుకుందాం.

సేకరణ… ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via