July 5, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Tirumala: అన్న పానీయాల్లో నాణ్యత ‘గోవిందా గోవింద!’

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు.



తిరుమలలో భక్తులకు సరఫరా చేసే తాగునీటిలో ప్రమాణాలు సున్నా

అపరిశుభ్రంగా వంటశాలలు ఆహారభద్రత ప్రమాణాలకు దూరంగా పదార్థాల సరఫరా

కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ అధ్యయనంలో వెల్లడి

అమరావతి: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. సెలవు రోజుల్లో లక్షమందికి పైగా వచ్చిన సందర్భాలూ ఎన్నో. అంత దివ్యక్షేత్రంలో భక్తులకు తితిదే అందిస్తున్న అన్న, పానీయాల్లో శుచి, శుభ్రత లేదు. తితిదే బోర్డు భద్రతా చర్యలన్నింటినీ గాలికి వదిలేసింది. అక్కడ జలప్రసాదం నీళ్లలో ప్రమాణాలు లేవు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అందించే ఆహారంలోనూ శుచి, శుభ్రత, నాణ్యత కానరావు. తితిదే వార్షిక బడ్జెట్ రూ.4వేల కోట్లు! ఆ స్థాయి సంపద కేంద్రంగా తిరుమలను మార్చిందీ భక్తులే. అలాంటి భక్తుల ఆరోగ్యానికి తితిదే గ్యారంటీ ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. భక్తుల ఆరోగ్య, ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇదేదో సాదాసీదా వ్యక్తులు చెబుతున్న విషయాలు, ఆరోపణలూ కావు- సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ నిపుణుల అధ్యయనంలో తేలిన అంశాలు. నీటిని సరఫరా చేసే ప్రాంతాల నుంచి నీటిశుద్ధి ప్లాంట్ల వరకు అన్నిచోట్లా లోపాలే. ఆహారపదార్థాల నుంచి, వాటిని నిల్వచేసే గోడౌన్ల వరకు ఎక్కడా ప్రమాణాలు పాటించట్లేదు. ఆ నివేదిక తితిదే నుంచి ‘ఈనాడు’కు చిక్కింది. 2023 జూన్, జులై నెలల్లో ఈ అధ్యయనం జరిగింది. ఆ నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి.

అవి మంచి నీళ్లా?

తిరుమల మొత్తానికి నీళ్లందించే జలాశయాలను అధ్యయన బృందం సందర్శించింది. పాండవ తీర్థం, గోగర్భం డ్యాం, ఆకాశగంగ, కుమార ధార, పసుపుధార, పాపనాశనాలను పరిశీలించింది. అక్కడి నీళ్లు కాస్త ఊదా రంగు నుంచి ఎరుపు రంగులో ఉన్నట్లు పేర్కొంది. ఆ నీళ్లలో ఇనుము అధికంగా ఉండే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. పాండవతీర్థంలో డ్యాం నుంచి లీకవుతున్న నీళ్లతో ఆ ప్రాంతం నిండిపోయిందని, అదే నీరు ఫిల్టర్హౌస్కు సరఫరా అవుతోందని కూడా గుర్తించారు. వేలమంది భక్తులకు నీళ్లందించే ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టలేదని పేర్కొంది. ఈ
పరిస్థితుల వల్ల ఆ నీళ్లలో ఎవరైనా హానికర పదార్థాలు కలిపే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని, అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కూడా లేదని ప్రస్తావించింది. తిరుమల భక్తులకు ఏ జలాశయాల నుంచి నీళ్లను అందిస్తున్నారో అక్కడ చనిపోయిన చెట్లు, మృత సేంద్రియ పదార్థాలు ఆ నీళ్లలో కలుస్తున్నాయని కూడా పేర్కొంది.

1968 నుంచి అదే ఫిల్టర్ హౌస్

నిత్యం వేలమంది భక్తులు వస్తూ, వేల కోట్ల నిధులున్న తిరుమలలో ఇప్పటికీ 1968లో నిర్మించిన నీటి ఫిల్టర్హౌస్ని వినియోగిస్తున్నారు. నీటిని ఫిల్డర్ చేసే ఛాంబర్లన్నీ ఎర్రటి నీటితో కనిపిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. నీటిశుద్ధి ప్రమాణాలను ఇక్కడ పాటించడం లేదు. మేదరమిట్ట, రాంబగీచా, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులకు జలప్రసాదం అందిస్తున్నారు. అక్కడ కూడా ఉండటంతో అక్కడ కీటకాలు, పురుగులు ఉంటున్నాయి. అనేక వ్యర్థాలను కూడా భక్తులు అక్కడే వదిలేస్తున్నా తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయలేదు.

నీటి నమూనాల్లో ప్రమాణాలు నిల్

జలప్రసాదంలో ఇచ్చే నీళ్లు ఆరోగ్యానికి అనువైనవిగా లేవని తేలింది. ఐఎస్:10500 ప్రమాణాల ప్రకారం నీటిలో పీహెచ్ స్థాయి 6.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. అలాంటిది ఈ మూడుచోట్ల శుద్ధిచేసిన నీటిలోనే కేవలం 5.5 స్థాయిలోనే పీహెచ్ (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) ఉంది. అలాంటి నీరు ఆరోగ్యానికి మంచిదికాదని ప్రమాణాలు పేర్కొంటున్నాయి.

లేబొరేటరీ అంతంతమాత్రమే

తిరుమలలో ఏర్పాటుచేసిన నీటి, ఆహార పరీక్షల లేబొరేటరీ అంతంతమాత్రంగా ఉంది. ఆహార ధాన్యాల్లో యూరిక్ యాసిడ్, కృత్రిమ రంగులు, ఇతర మైక్రోబయాలజీ పరీక్షలు చేసి ఆహార పదార్థాల నాణ్యత తేల్చాలి. ఈ పరీక్షలు చేస్తేనే వాటి నాణ్యత బయటపడుతుంది. అలాంటి పరీక్షలకు అవసరమైన పరికరాలు ఈ లేబొరేటరీలో లేవని కమిటీ గుర్తించింది.

వెంగమాంబ అన్నదానం… ప్రమాణాలు బహుదూరం

తితిదేలో ఆహార తయారీ, ఆహారాలు నిల్వచేసే గోడౌన్లు, వంటలు వండే వంటశాలల వరకూ అన్నిచోట్లా లోపాలే. వంటకు వినియోగించే పదార్థాల ప్రమాణాలకు గ్యారంటీ లేదు. తిరుమలకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో ఆహార నాణ్యత, నియమాలు పాటించే నిబంధనలు లేవని తేలింది. ఆహారభద్రత చట్టం నియమాలను సరఫరాదారులు పాటించాలనే టెండరు నిబంధనను తితిదే అమలు చేయడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. ఒక్క సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి 2011 ఆహార నాణ్యత నియంత్రణ లేబుల్స్ అక్కడ కనిపించలేదని కమిటీ తేల్చింది. ఓ గోడౌన్లో పరిశుభ్రతా చర్యలు లేవు. సీలింగు, గోడల వద్ద సాలెపురుగులు కనిపించాయి. ఆ గోడౌన్లో ప్రామాణిక నిర్వహణ విధానం అమలు కావడం లేదు. ఈ గోడౌన్లో పనిచేస్తున్న లేదా ఈ పదార్థాల రవాణా, ఇతర వ్యవహారాలతో సంబంధం ఉన్న సిబ్బంది ఆరోగ్య రికార్డులూ లేవు. అక్కడ కోếరేజి వివరాలు కూడా  ఏమీ లేవు. కందిపప్పు, శనగపప్పుల వినియోగానికి నిర్దేశించిన ఆహారభద్రత నియమాలు ఏవీ టెండర్ డాక్యుమెంట్లలో ప్రస్తావించిన దాఖలాలు లేవు. చెదలు, ఇతర పురుగులు పట్టకుండా అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. వీటిపై గోడౌన్లో రికార్డులు లేవు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్సు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏ) లేబుల్ ఆహారపదార్థాలపై ఉండటం లేదు. ఉప్పు, మిర్చి పొడి ఎవరు తయారుచేశారనే సమాచారం ప్యాకెట్ల మీద లేదు. ఎన్ని రోజుల వరకు ఆ ఆహార పదార్థాలు వినియోగించవచ్చనే వివరాలూ వాటిపై కనిపించలేదు. గోడౌన్లో ఆహార నిల్వలకు ఎలాంటి ప్యాలెట్లు ఉపయోగించడం లేదు. చాలినన్ని ప్యాలెట్లు లేవు. వంటశాలలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ డ్రైనేజి వ్యవస్థ కూడా సరిగా లేదు. వదిలేసిన ఆహార పదార్థాలతో నిండిపోయి సరిగా మురుగు నీరు పారడం లేదు. వంట చేసే మహిళలు, వారికి సహకరిం సిబ్బంది కూడా తలలకు టోపీలు ధరించడం లేదు.

Also read

Related posts

Share via