October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Basara: బాసర ఆలయంలో దొంగ హల్చల్

ఓ హుండీ ధ్వంసం.. పలు చోట్ల చోరీకి యత్నం ఆలయంలో 2 గంటలపాటు సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదు


విధుల్లో నిర్లక్ష్యం వహించిన హోంగార్డులపై అధికారుల చర్యలు

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ బాసర సరస్వతి ఆలయంలో బుధవారం రాత్రి ఓ దొంగ హల్ చల్ చేశాడు.



ముథోల్(బాసర): నిర్మల్ జిల్లాలోని ప్రముఖ బాసర సరస్వతి ఆలయంలో బుధవారం రాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. సుమారు రెండు గంటలపాటు ఆలయంలో కలియతిరిగి ఓ హుండీని పగులగొట్టడంతోపాటు పలు చోట్ల చోరీ యత్నానికి పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా విధుల్లో ఉన్న హోంగార్డులు గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలానే రాత్రి 8.30 గంటలకు హారతి అనంతరం ఆలయాన్ని మూసివేశారు. ఇక్కడ రోజూ రాత్రి ఆరుగురు హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారు. ఇద్దరు ద్వారం వద్ద, మిగిలిన వారు చుట్టూ కాపలా ఉంటారు. బుధవారం రాత్రి ఇద్దరు ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు కాగా నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. వారి కళ్లుగప్పి ఓ దొంగ రాత్రి 10.20 గంటలకు క్యూలైన్ల మీదుగా నడుచుకుంటూ వచ్చి గోశాల పైనుంచి ఆలయంలోకి దిగాడు. మొదట అక్కడి దత్తాత్రేయ ఆలయం ముందు ఏర్పాటు చేసిన హుండీని పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నాడు. అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా జాలీలు గట్టిగా ఉండటంతో సాధ్యం కాలేదు. ఆలయం వెనకాల ఉన్న మరో హుండీని పగులగొట్టేందుకూ యత్నించి విఫలమయ్యాడు. చీరల కౌంటర్లోని రెండు ఖాళీ బ్యాగులను తీసుకున్నాడు. ఆలయం ముందున్న ప్రసాదాల కౌంటర్ను ధ్వంసం చేశాడు. ఇలా దాదాపు రెండు గంటలపాటు అక్కడక్కడే తిరిగి వెళ్లిపోయాడు. ఈ సమయంలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు స్థానిక పోలీసులు హోంగార్డుల విధులను పర్యవేక్షించి బయట నుంచే వెళ్లిపోయారు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలయం లోపలికి వెళ్లిన హోంగార్డులు దొంగతనాన్ని గుర్తించారు. వెంటనే అక్కడే తన గదిలో ఉన్న ఇన్ఛార్జి ఈవో విజయరామారావు వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆయన సమాచారంతో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, ముథోల్ సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్లు ఆలయానికి చేరుకొని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు హోంగార్డులను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్  చేస్తున్నామని, దొంగను శుక్రవారం వరకు పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు. సుమారు రూ.20 వేల వరకు చోరీ జరిగి ఉండొచ్చని ఈవో తెలిపారు.

Also read

Related posts

Share via