తెలంగాణలో కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదైన సూపర్ స్పెషాలిటీ కేసుల వివరాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదైన సూపర్ స్పెషాలిటీ కేసుల వివరాలు వెల్లడించాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో 10 లక్షల మందికి పైగా వివిధ సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందారు. కిడ్నీ సంబంధిత 3,63,197 కేసులు నమోదు కాగా.. క్యాన్సర్ 3,06,702 కేసులు, ఎముకల సంబంధిత వ్యాధులు 1,93,852 కేసులు, గుండె సంబంధిత సమస్యలు 1,45,814 కేసులు నమోదు అయ్యాయి.
ఆరోగ్యశ్రీ డేటాలో ఆందోళనకర విషయాలు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీవనశైలి మార్పులు, కాలుష్యం, ఆరోగ్య అవగాహన లోపం, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ వాడటం వంటివి ఈ వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఈ పెరుగుతున్న రోగాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 104 కేంద్రాలకు అదనంగా మరో 70 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక వేస్తోంది.
క్యాన్సర్ చికిత్సలైన కీమోథెరపీ, రేడియోథెరపీని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. గత ఐదేళ్లలో.. ఆరోగ్యశ్రీ కింద 20 ముఖ్య సూపర్ స్పెషాలిటీ సేవలకు గాను ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.3,110 కోట్లు చెల్లించింది. ఇందులో కార్డియాలజీ (రూ.629.74 కోట్లు), పాలిట్రామా (రూ.551.44 కోట్లు), నెఫ్రాలజీ (రూ.322.98 కోట్లు) వంటి వాటికి అధిక నిధులు కేటాయించబడ్డాయి. ఈ భారీ మొత్తాన్ని ఆదా చేయడానికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి, ప్రభుత్వం ముఖ్యమైన 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రజారోగ్య పరిస్థితిని సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను బలోపేతం చేయడానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కిడ్నీ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని మంత్రి నిర్ణయించారు. ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల ప్రవాహాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో 3,06,702 మంది క్యాన్సర్ సంబంధిత చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందారు. రాష్ట్రంలో కేవలం ఎంజీఎం ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉండగా.. ఉస్మానియా, గాంధీ వంటి ఇతర జిల్లా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి చికిత్సలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గుండె మరియు ఆర్థోపెడిక్‌కు ప్రాధాన్యత:
కిడ్నీ, క్యాన్సర్ తర్వాత మూడవ స్థానంలో ఉన్న ఆర్థోపెడిక్ కేసులను (1,91,852 కేసులు) పరిగణనలోకి తీసుకుని.. ట్రామా కేర్ సెంటర్లను జాతీయ, రాష్ట్ర రహదారులపై ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 10 కంటే తక్కువగా ఉన్న ఈ కేంద్రాల సంఖ్యను మరో 74 పెంచడానికి మంత్రి ఆమోదం తెలిపారు. అదేవిధంగా.. గత ఐదేళ్లలో 1,45,814 గుండె సంబంధిత వ్యాధుల కేసులు నమోదు కావడంతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. 2డీ ఎకో, యాంజియోగ్రామ్, స్టెంట్ ప్లేస్‌మెంట్ వంటి సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోనున్నారు.
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..