November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. కట్ చేస్తే కటకటాలపాలైన తహసీల్దార్‌ జయశ్రీ.. ఎందుకు..?

ధరణిని ఆసరాగా చేసుకుని ఎంతో మంది రెవిన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు బదలాయించి అవినీతికి పాల్పడిన తహసీల్దార్‌ జయశ్రీ కటకటాల పాలయ్యారు.


నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ 2019 నుంచి 2023 వరకు హుజూర్‌నగర్‌లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఉన్నతాధికారులకు తెలియకుండా బూరుగుగడ్డ గ్రామానికి చెందిన 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘ధరణి’ కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్ బంధువులకు బదలాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల బదలాయింపుపై బూరుగడ్డ గ్రామస్థులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ హుజూర్ నగర్ ఆర్డీవోతో ప్రాథమిక విచారణ జరిపించారు.

‘ధరణి’ ఆపరేటర్ జగదీశ్ కుటుంబ సభ్యులు పేరిట రూ.1కోటీ 56లక్షల విలువైన 36.23 ఎకరాల భూమిని బదలాయించినట్లు విచారణలో తేలింది. అక్రమంగా ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ పట్టాలు పొందిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ బంధువులకు ‘రైతుబంధు’ కింద రూ.14,63,004 లబ్ధి చేకూరగా ఆ మొత్తాన్ని జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్‌ పంచుకున్నట్లు తేల్చారు. ఆర్డీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్‌ జయశ్రీ, ఆపరేటర్ జగదీష్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆపరేటర్‌ జగదీష్‌ను అరెస్టు చేశారు. తాజాగా తహసిల్దార్ జయశ్రీని హుజూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హుజూర్ నగర్ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read

Related posts

Share via