SGSTV NEWS online
EntertainmentNational

Bengaluru: ప్రవర్తనను ప్రశ్నించిందని.. తల్లిని చంపిన కుమార్తె



బెంగళూరు (జేపీనగర): ఈడొచ్చిన అమ్మాయికి.. తల్లి మంచి మాటలు చెప్పడమే తప్పైంది. యువకులతో తిరగొద్దన్న అమ్మ మందలింపులు ఆమెకు రుచించలేదు. ఆ కోపం పట్టలేక నలుగురు స్నేహితులతో కలిసి తల్లిని కిరాతకంగా కడతేర్చింది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పరిధిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చారు. నగరానికి చెందిన ఓ మహిళ(35) తన కుమార్తె(15) కట్టుతప్పి ప్రవర్తిస్తున్నట్లు గమనించి ఇటీవల తీవ్రంగా మందలించింది. తల్లిపై పగ పెంచుకున్న ఆ బాలిక అక్టోబరు 25న 17 ఏళ్ల లోపు వయస్సున్న నలుగురు స్నేహితులను తన ఇంటికి పిలిపించుకుంది. పక్క గదిలో నిద్రపోతున్న ఆ మహిళ పిల్లల విపరీత నవ్వులకు లేచింది.

కుమార్తె అభ్యంతరకర స్థితిలో ఉన్నట్లు గుర్తించి, మందలించింది. అప్పటికే పథకం వేసుకున్న వారంతా ఆమెను చుట్టుముట్టి, నోటిని మూసి, గొంతుకు తువ్వాలుతో బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్కు కట్టి వేలాడదీశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మరునాడు ఆ ఇంటికి వచ్చిన మృతురాలి సోదరి.. మృతదేహాన్ని గుర్తించి, స్థానికులు, బంధువుల సాయంతో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే తల్లి అంత్యక్రియలకు ఆ బాలిక రాకపోవడంతో అనుమానం వచ్చి, పోలీసే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, హత్యోదంతం వెలుగుచూసింది. శుక్రవారం బాలిక సహా నలుగురు బాలలను రిమాండ్కు తరలించారు.

Also read

Related posts