April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

షాకింగ్ ఘటన.. దోశ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

దోశ కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది. దోశ గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

గ్రహచారం బాలేకపోతే తాడే పామై కరిచిందన్నట్టు.. నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గ్రహచారం బాలేకపోతే ఏం చేయలేం కదా దేన్నైనా ఎదుర్కోవాల్సిందే. అనుకోకుండా జరిగే ఘటనలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. కొన్ని సార్లు లైఫ్ లేకుండా చేస్తాయి. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దోశ తింటూ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ గొంతులో అడ్డుపడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇదే రీతిలో దోశ గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు.


ఘన పదార్థాలు గొంతులో చిక్కుకుపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే మెత్తటి పదార్థమైన దోశ కూడా ఇరుక్కుపోయి ప్రాణాలు పోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. పూర్తి వివరాలు చూసినట్లైతే.. కల్వకుర్తికి చెందిన 41 ఏళ్ల వెంకటయ్యకు మద్యం తాగే అలవాటు ఉంది. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా మద్యం సేవించాడు. ఈ క్రమంలో అతడు ఓ హోటల్ నుంచి దోశ తెచ్చుకున్నాడు. దోశ తింటున్న సమయంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంకటయ్య ఊపిరాడక విలవిల్లాడాడు. శ్వాస సమస్య తలెత్తడంతో వెంకటయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంకటయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

వెంకటయ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దోశ కారణంగా ప్రాణాలు పోవడంతో గుండెలవిసేలా రోధించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. అస్వస్థతకు గురైన ఘటనలు చూశాం. కానీ దోశ, ఇడ్లీలు కూడా గొంతులో ఇరుక్కుని చనిపోవడంతో షాక్ కు గురవుతున్నారు. ఆహారాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. త్వరగా తినాలన్న ఉద్దేశ్యంతో మెత్తగా నమలకుండా తింటే గొంతులో ఇరుక్కునే ప్రమాదాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. వేగంగా తినకూడదని, తినేటప్పుడు మాట్లాడకూడదని సూచిస్తున్నారు.

Also read

Related posts

Share via