హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. దోమల నివారణ పెట్టే కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శివానంద రీహాబిటేషన్ హోమ్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కూకట్‌పల్లిలోని శివానంద రీహాబిటేషన్ హోమ్‌లో విమల అనే మహిళ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో కలిసి ఒక క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. గత శుక్రవారం(ఆగస్ట్ 30) రోజున రాత్రి తమ స్వగ్రామం బాపట్ల నుండి ఉన్నత చదువుల కోసం కోసం వచ్చిన తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నారు. ఇదే క్రమంలో దోమల నివారణకు ఉంచిన బత్తి మండి చుట్టు పక్కల ఉన్న వస్తువులకు అంటుకుంది. అదీకాస్తా, కిచెన్‌లోని సిలిండర్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో ఊపిరి ఆడక అభిషేక్ (27) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తల్లి దీనమ్మ 35 శాతం కాలిన గాయాలతో పక్కనే ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రిలో ఐసియూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి వర్గాలు కానీ, పోలీసులు కానీ, ఫైర్ ఉద్యోగులు గాని స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. చివరికి యువకుడి మరణంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టరు. అయితే, భవిష్యత్తుపై ఆశలతో బాపట్ల నుండి ఉన్నత విద్య కోసం వచ్చిన యువకుడు చిన్న నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది. ఈ సంఘటన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. విమల కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు