SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ: ఉదయం పొలానికి వెళ్లి తిరిగొచ్చిన భార్య.. కట్ చేస్తే ఆమె చేసిన పనికి..



ఖమ్మం జిల్లా జగ్యా తండాలో దారుణం జరిగింది. రౌడీ షీటర్ లైంగిక వేధింపులకు మహిళ బలైంది. వేధింపులను భరించలేని వివాహిత మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమకు న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.


ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కీచకుల వేధింపుల ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట ఈ వేధింపులకు మహిళలు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో దారుణం జరిగింది. రౌడీ షీటర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగ్యా తండాలో చోటుచేసుకుంది. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల అనే వివాహిత ఉదయం మరో మహిళతో కలిసి పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో పొలం యజమాని వారి ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ సుశీల వద్దకు వెళ్ళాడు. వినయ్ ఆమెను తన లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. సుశీల దీనిని తీవ్రంగా ప్రతిఘటించగా.. వినయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్ వేధింపులు, దాడితో తీవ్ర మనస్తాపం చెందిన సుశీల, ఇంటికి తిరిగి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


కుటుంబ సభ్యుల ఆందోళన
ఘటన జరిగిన తర్వాత సుశీల మృతదేహంపై గాయాలు ఉన్నాయని, కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. అయితే భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రఘునాథపాలెం పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

ఇటీవలే రౌడీషీట్
నిందితుడైన ధరావత్ వినయ్‌పై కొద్ది రోజుల క్రితమే పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్లు సమాచారం. ఇప్పటికే అతడు పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశీల భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్‌పై కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ వేధింపులు, దాడి కారణంగానే సుశీల ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Also read

Related posts