April 28, 2025
SGSTV NEWS
CrimeEntertainment

ఒక్కడు.. వంద అనుమానాలు..! దుబాయ్‌లో చనిపోతే తెలంగాణలో ప్రకంపనలు!



హైదరాబాద్ వదిలి దుబాయ్‌లోనే సెటిల్ అవ్వాలని కేదార్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి దుబాయ్ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారాలు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం ఉంది. దుబాయ్‌లోని ఓ పెద్ద ల్యాండ్‌ డెవలపింగ్‌ కంపెనీలో కేదార్‌ కీలక వాటాదారుగా ఉన్నారని కూడా చెబుతున్నారు.


ఆయనో ప్రొడ్యూసర్. దురదృష్టవశాత్తూ దేశం కాని దేశంలో చనిపోయాడు. ఆయన మరణం టాలీవుడ్‌ను కలచివేసింది. తెలంగాణలోని ప్రముఖులనూ కదిలించింది. కానీ ఇదంతా ఆయన మరణంతో వచ్చిన సానుభూతా…లేక బినామీగా ఉన్నాడన్న అనుమానంతో వచ్చిన సునామీనా.? దుబాయ్‌లో తీగలాగితే.. తెలంగాణలో ఎందుకు డొంక కదులుతోంది. ఇంతకూ ఆ ప్రొడ్యూసర్‌ దుబాయ్‌లో చనిపోవడం వెనుక ఏమైనా మిస్టరీ దాగుందా..? ఆయనకు రాజకీయ నేతలకు ఉన్న లింకేంటి..? టాలీవుడ్‌ ప్రముఖుల్లో ఎందుకింత ఆందోళన..? తెలంగాణ సీఎం వ్యాఖ్యల వెనుకున్న మర్మమేంటి..? అన్న చర్చ మొదలైంది.

కేదార్ సెలగంశెట్టి.. టాలీవుడ్ నిర్మాత. ఆయన అకస్మిక మరణం..అటు టాలీవుడ్‌లో గుబులు పుట్టించగా.. రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కేదార్ ఎలా చనిపోయాడో ఇప్పటివరకు దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. కానీ మన తెలంగాణలో ఆయన మరణంపై పొలిటికల్ పోస్టుమార్టం చాలా లోతుగా జరుగుతోంది….

అసలీ కేదార్ హిస్టరీ తవ్వితే.. తవ్వే కొద్దీ అనేక సంచలనాలు బయటపడుతున్నాయి. ముందుగా ఆయన దుబాయ్‌ కేంద్రంగా నిర్మాణ, స్థిరాస్తి రంగాల్లో వ్యాపారాలు నిర్వహించేవాడు. కేదార్ పైన నమ్మకంతో టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు వందల కోట్లు పెట్టుబడులు పెట్టారు. వారికి కేదార్ బినామీగా వ్యవహరించాడని టాక్. తెలుగులో రెండు మూడు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు కేదార్. హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ తో గంగం గణేశా మూవీ తీశాడు. అదే ఉత్సాహంతో మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లకు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేదార్ గతంలో న్యూజెర్సీలో నైన్ డైమ్ టెక్నాలజీస్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. తర్వాత న్యూజెర్సీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి, టాలీవుడ్‌ పెద్దలతో పరిచయం పెంచుకున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలతోనూ కేదార్‌కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కేదార్ నిర్వహించే అనేక వ్యాపారాల్లో రాజకీయ నేతలకూ భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అనతికాలంలోనే అటు సినిమా, ఇటు పబ్‌, రెస్టారెంట్ బిజినెస్‌ల్లో బిజీగా మారిపోయాడు కేదార్. ఒకవైపు సినిమాల నిర్మాణం, మరోవైపు పబ్బు బిజినెస్, ఇంకోవైపు రెస్టారెంట్ వ్యాపారం అంతా బాగానే నడిచింది. కానీ కేదార్‌ లైఫ్‌ 2024లో మరో టర్న్ తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ర్యాడిసన్ హోటల్‌పై జరిగిన దాడులతో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. డ్రగ్స్ పార్టీలో కేసు నమోదైన 11మంది నిందితుల్లో కేదార్‌ కూడా ఒకరు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కేదార్‌కు పాజిటవ్‌గా రావడంతో.. ఏ5 నిందితుడిగా పోలీసులు చేర్చారు.

డ్రగ్ కేసుకు సంబంధించి పలుమార్లు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యాడు కేదార్. ఈ కేసు విచారణ సమయంలోనే కేదార్‌కు ఉన్న రాజకీయ పరిచయాలు బయటపడ్డాయి. దీంతో హైదరాబాద్ వదిలి దుబాయ్‌లోనే సెటిల్ అవ్వాలని కేదార్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి దుబాయ్ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారాలు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం ఉంది. దుబాయ్‌లోని ఓ పెద్ద ల్యాండ్‌ డెవలపింగ్‌ కంపెనీలో కేదార్‌ కీలక వాటాదారుగా ఉన్నారని కూడా చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్ర క్షన్‌ కంపెనీలకు ఆ సంస్థ భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తోంది. దీంతో..టాలీవుడ్‌ ప్రముఖుల తరఫున కేదార్‌ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కేదార్ తొమ్మది కంపెనీల్లో డైరెక్టర్ – ఛైర్మన్ వంటి హోదాల్లో ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి అందుతున్న సమాచారం.

కేదార్ బాధ్యతలు తీసుకున్న మెజార్టీ కంపెనీలు కన్‌స్ట్రక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు సం బంధించినవే. పలువురు అగ్రహీరోలతో పాటు పొలిటికల్ లీడర్స్ సైతం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినీ – రాజకీయ ప్రముఖులు కేదార్ ఆహ్వానం మేరకు దుబాయ్ వెళ్లేవారు. వారికి సంబంధించిన పెట్టుబడులు.. లెక్కలు మొత్తం కేదార్‌కు మాత్రమే తెలుసు. ఇప్పుడు కేదార్ మరణంతో పెట్టుబడి పెట్టిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతల్లోనూ గుబులు మొదలైంది. దుబాయ్‌లో తన కూతురితో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరైన కేదార్.. ఈవెంట్ ముగిసిన తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు.అలా నిద్రలోనే చనిపోయారు.

దుబాయ్ పోలీసులు కేదార్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. ఇప్పటివరకు ఆయనెలా చనిపోయాడన్నది దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. ఈలోపు తెలంగాణలో కేదార్ డెడ్‌పై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఢిల్లీలో కేదార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం, మృతుడికి మాజీ మంత్రికి సంబంధం ఉందని ఆరోపించడంతో కేదార్ డెడ్ మిస్టరీపై రాజకీయంగా అతిపెద్ద సంచలనమైంది. అయితే సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారని.. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు కేటీఆర్‌.

మరోవైపు మిస్టరీ మరణాలంటూ రేవంత్‌రెడ్డి తమపై కుట్ర చేస్తున్నారని…వివిధ కారణాలతో జరిగిన మరణాలను తమకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్సీ కవిత. మొత్తానికి కేదార్ మరణం రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. అటు టాలీవుడ్‌లోనూ కలకలం సృష్టించింది. మరి కేదార్ మరణం సహజమా..? లేక ఏదైనా మిస్టరీ దాగుందా..? రాజకీయంగా వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..? అన్నది తేలాల్సి ఉంది.

Also read

Related posts

Share via