SGSTV NEWS
CrimeTelangana

Telangana: అరేయ్ ఏంట్రా ఇది.. వాట్సప్‌లో ఎమోజీ పెట్టినందుకు కొట్టి చంపారు.. సూర్యాపేటలో దారుణం..

ఆధునిక సమాజంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు సమాచార మార్పిడికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో.. అదే స్థాయిలో వ్యక్తిగత దూషణలు, కక్షలు, ద్వేషాలు, ద్వేషపూరిత సంబంధాలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులకు తమ అభిప్రాయాలకు అనుగుణంగా లైక్ చేయడం, డిస్ లైక్ చేయడం సాధారణమే.. కానీ ఒకరు మాత్రం సోషల్ మీడియా పోస్ట్ కు ఎమోజీ పెట్టడమే తప్పయింది. ఆ తప్పే అతడిని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. సూర్యాపేట పట్టణంలో ఉన్న పద్మశాలీలు ఏర్పాటు చేసుకున్న సంఘం గత కొన్నేళ్లుగా చురుకుగా పని చేస్తోంది. ఈ క్రమంలో పద్మశాలీ సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం పూర్తయింది. వచ్చే నెల 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కాలంగా సంఘంలో రగులుతున్న విభేదాలు మరింతగా ముదిరాయి. ప్రస్తుత పట్టణ అధ్యక్షుడిగా అప్పం శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్టణ అధ్యక్ష పదవికి శ్రీరాముల రాములు నామినేషన్‌ వేశారు.

సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో రాములు, శ్రీనివాసులు ఏడాదిగా వివిధ పోస్టులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ టార్గెట్‌గా తాజా అభ్యర్థి శ్రీరాముల రాములు పోస్టులు పెడుతున్నాడు. అప్పం శ్రీనివాస్‌ సంఘం నిధులను కాజేశారంటూ శ్రీరాముల రాములు పోస్ట్‌ పెట్టాడు. ఇందుకు బదులుగా అప్పం శ్రీనివాస్‌ కూడా వివరణ ఇచ్చారు. అయితే.. సూర్యాపేట భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన మానుపురి కృపాకర్‌ (54) వివరణ పోస్ట్‌కు మద్దతు పలుకుతూ క్లాప్స్‌ కొటైనట్లు (👏) ఎమోజీని పెట్టారు.

దీనిని చూసిన రాములు ఆగ్రహంతో కృపాకర్‌కు ఫోన్‌ చేసి దూషించారు. మనస్తాపానికి గురైన కృపాకర్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు పద్మశాలీ భవనానికి వెళ్లారు. అక్కడే ఉన్న రాములు, అతని కుమారుడు ధనుంజయ్‌ తోపాటు స్నేహితులు కృపాకర్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాములు, ధనుంజయ్‌ తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Also read

Related posts

Share this