భరతజాతికి ఇంటి ఇలవేల్పుగా భావించే శ్రీరాముడి రూపం.. అందరి మనసులో నుదుటిపై కస్తూరి తిలకం, పెదాలపై చిరునవ్వు, చేతిలో బాణంతో.. మెదులుతూ ఉంటుంది. కానీ సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడు వెరైటీగా కనిపించాడు. అయితే ఈ సినిమాలో కనిపించిన శ్రీరాముడి రూపంపై పెద్ద చర్చే జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని ఆలయాల్లో శ్రీరాముడు అరుదైన రూపాల్లో కూడా కనిపిస్తుంటాడు. నల్లగొండ జిల్లాలో కనిపించే శ్రీరాముడి అరుదైన రూపం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీరాముడు భిన్నంగా దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ప్రాజెక్టు పక్కన నిర్మించారు. ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. శ్రీరాముడు.. సీత, లక్ష్మణుడితో కలిసి చేసిన వనవాసంలో ఒకరోజు ఈ ప్రాంతంలో గడిపాడని స్థల పురాణం చెబుతోంది. వందల ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక ఆచార్యుడికి కలలో కనిపించిన శ్రీరాముడు గ్రామ శివారులో తన పాదుకలు ఉన్నాయని, వాటితో ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడట. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆ పాదుకులను గుర్తించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. వనవాస సమయంలో శ్రీరాముడు క్షౌర కర్మ చేయక పోవడంతో మీసాలు, గడ్డాలతో ఉన్నాడని, అందుకే ఈ ఆలయంలో శ్రీరాముడు మీసాలతో దర్శనమిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి రాముడికి శక్తి కొలది వెండి, బంగారు మీసాలు సమర్పిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి సీతమ్మకు పుస్తె మట్టెలు సమర్పిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, దాంపత్య జీవితం గొప్పగా ఉంటుందని ఇక్కడి గ్రామీణ ప్రజల నమ్మకం.
సేద తీరాక.. కల్యాణానికి సిద్ధం..
ప్రతీ ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం ఇక్కడ చూడ ముచ్చటగా జరుగుతుంది. ఎక్కడైనా సీతారాముల కల్యాణం మధ్యాహ్నం నిర్వహిస్తుంటారు. కానీ శాలిగౌరారంలో మాత్రం రాత్రి పూట కల్యాణం జరుపుతారు. ఇందుకు ఒక ప్రత్యేక కథ ప్రచారంలో ఉంది. భద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగిన తరువాత రథంపై శ్రీసీతారాములు శాలిగౌరారం దేవాలయానికి వచ్చి కొద్దిసేపు సేద తీరుతారట. ఆ తరువాత మళ్లీ ఇక్కడ కల్యాణానికి సిద్ధమవుతారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కల్యాణాన్ని రాత్రి పూట నిర్వహిస్తారనీ స్థానికులు చెబుతున్నారు.
నేటి నుండి 11 వరకు ఉత్సవాలు శాలిగౌరారం శ్రీ సీతారాములు బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది శ్రీరామనవమి నుంచి మొదలవుతాయి. నేటి మధ్యాహ్నం గరుడ హోమం వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులు గరుడ ధ్వజానికి అర్పించిన ‘గరుడ ముద్ద’ అనే బియ్యపు వంటను తినడం ద్వారా సంతానం ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతున్నారు. రాత్రి 9 గంటలకు ఎదుర్కోలు, రాత్రి 10 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 7న సోమవారం ప్రాబోధక ఆరాధన, రాత్రికి హనుమంత సేవ, 8న మంగళ వారం రాత్రి సదస్యం గరుడసేవ(మొక్కు సేవలు)ఉంటాయి. 9న బుధవారం ఉదయం సుదర్శన హోమం, బలిహరణం, రాత్రి పొన్నసేవలు ఉంటాయి. 10న గురువారం మధ్యాహ్నం చక్కర స్నానం, రాత్రికి జాతర ఉంటుంది.
