SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద వోల్వో బస్సులో పోలీసుల తనిఖీలు.. లగేజ్ క్యాబిన్‌లో



ఒరిస్సా టూ హైదరాబాద్ ప్రయాణం… నాలుగు లగేజ్ బ్యాగులు తీసుకొచ్చి.. క్యాబిన్‌లో పెట్టేశాడు. బస్సు ఎక్కి దర్జాగా పడుకున్నాడు. బస్సు హైదరాబాద్ శివారు ప్రాంతానికి వచ్చింది. అక్కడ బస్సును ఆపిన పోలీసులు.. మొత్తం తనిఖీ చేయడం ప్రారంభించారు.. దీంతో గుట్టు వీడింది.


వీడికి ఎంత ధైర్యమో చూడండి.. ఏకంగా గంజాయితో వోల్వో బస్సు ఎక్కాడు. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థాన్ని బ్యాగుల్లో నింపి లగేజ్ క్యాబిన్‌లో పెట్టాడు. ఆపై బస్సు ఎక్కి ఎంచక్కా కునుకేశాడు. అయితే.. పాపం పండకుండా ఉంటుందా చెప్పండి. అడ్డంగా పోలీసులకు చిక్కేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు వోల్వో బస్సులో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వస్తున్న నిందితుడిని రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం పట్టుకుంది. నిందితుడు నాభి నాయక్ అలియాస్ హరి నాలుగు బ్యాగుల్లో గంజాయిని నింపి, బస్సు లగేజ్ బాక్స్‌లో దాచిపెట్టి, దర్జాగా ఏసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అతడు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్, సీఐలు సుభాష్ చందర్, బాలరాజు తదితరులు బృందంతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద బస్సును అడ్డుకున్నారు. బస్సును తనిఖీ చేయగా నాలుగు బ్యాగుల్లో గంజాయి దొరికింది. నిందితుడు ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి 20.600 కిలోలు ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ.11 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు. నిందితుడు నాభి నాయక్ అలియాస్ హరిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని హయత్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. గంజాయి స్మగ్లర్‌ను పట్టుకున్న టీంను ఎక్సైజ్ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ అభినందించారు

Also read

Related posts