రామరాజ్యం పేరుతో దేశంపై పడింది ఓ రాక్షసమూక. నిత్యం దేవుడి సేవలో తరించే..పూజారులపై దాడులకు దిగుతోంది. తాము చెప్పినట్టు వినకపోతే..దేనికైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తోంది. తాజాగా చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడికి దిగింది. అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ దాడిపై త్రిదండి చిన్నజీయర్ స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. రంగరాజన్‌పై జరిగిన దాడి యోగ్య మైన కాదన్నారు. ప్రస్తుతం సమాజంలో దేవాలయాల అర్చకుల పరిస్థితి బాగా లేదన్న ఆయన, వారి ఆర్ధిక పరిస్థితి విద్యా అవకాశాలు లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. రంగరాజన్ పై జరిగిన దాడి విషయం నాకు తెలిసిందని, హింస ద్వారా రామరాజ్యం స్థాపన అనేది అసాధ్యమన్నారు. సమాజంలో హింసకు తావు లేదన్న ఆయన, తీవ్రవాదంతోను ఉగ్రవాదంతోను సాధించేది ఏమీ లేదన్నారు. కేవలం తాత్కాలిక లాభాలు చేకూరావచ్చు, కానీ అది శాశ్వతం కాదన్నారు. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు. అది ఏ ఒక్కరితో సాధ్యం కాదు. సమాజంలోని ప్రజలందరూ అనుకుంటేనే రామ రాజ్య స్థాపన జరుగుతుందన్నారు. మరోవైపు ఈ దాడిని దేవాలయ, అర్చక వ్యవస్థపై జరిగిన దాడిగా గుర్తించాలన్న వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్..ఘటనకు పాల్పడ్డ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అనపర్తికి చెందిన వీరరాఘవరెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఫిబ్రవరి 7వ తేదీన తన అనుచరులతో కలిసి చిలుకూరులోని రంగరాజన్ నివాసానికి వెళ్లాడు. వీరరాఘవరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో రామరాజ్య స్థాపనకు సైన్యాన్ని తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని డిమాండ్ చేశారు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు ఒప్పుకోని అర్చకుడు రంగరాజన్..తానెందుకు అలా చేస్తానని ప్రశ్నించారు. అలాంటి చర్యలు సమాజానికి ప్రమాదకరమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తాను చెప్పినట్టు వినాలంటూ రంగరాజన్‌పై దాడి చేశాడు. వీరరాఘవ రెడ్డి. రంగరాజన్‌పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు.
దాడి ఘటనపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..రంగరాజన్. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 7వ తేదీన సుమారు 20 మంది చిలుకూరు బాలాజీ ఆలయంలోని తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు రంగరాజన్. వీర రాఘవరెడ్డితోపాటు ముగ్గురు, నలుగురు తనపై దాడి చేస్తుంటే, కొందరు ఆ దాడిని వీడియో చిత్రీకరించారని వివరించారు. తమ మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఫలితం భయానకంగా ఉంటుందని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సైన్యం కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, తనకు మద్దతు ఇవ్వాలని బెదిరించినట్లు పూజారి పోలీసుల దృష్టికి తెచ్చారు. పైగా తాను మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా, తనను కొట్టారని, తాను మాట్లాడకూడదని, వినాల్సిందే అని అరిచారన్నారు. ఇలాంటి వ్యక్తులు రామ సేన పేరుతో నక్సల్స్‌లాగా సమాంతర సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే, అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని పూజారి రంగరాజన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు.
రామరాజ్యం పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన రాఘవరెడ్డి.. తన టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో తిరుగుతున్నాడు. తన సైన్యంలో చేరేవారికి జీతం ఇస్తానంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే విజయవాడ, కోటప్పకొండ ఆలయాలకు రాఘవరెడ్డి టీమ్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేశాడు వీరరాఘవ రెడ్డి. రామరాజ్యం పేరుతో వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్న రాఘవరెడ్డి.. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ పలు వీడియోలను కూడా పోస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు