ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని వెరిటాస్ సైనిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు లేఖ ద్వారా వివరాలు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం నిందిత ఉపాధ్యాయుడు ప్రణయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులు.. కొన్నిసార్లు అదే బాధ్యతను విస్మరిస్తూ అసభ్యకర ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికి చెడ్డపేరు తెస్తున్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని వెరిటాస్ సైనిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్లాస్‌రూమ్ డెకరేషన్ కోసం 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రణయ్ అనే వ్యక్తి తనతో తీసుకెళ్లాడు. క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి.. ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వెంటనే ఆ విద్యార్థిని ధైర్యం చేసి ప్రిన్సిపల్‌కు ఈ విషయాన్ని చెప్పింది. అయితే ప్రిన్సిపల్ ఆమెకు అండగా నిలబడకపోగా.. భయపెట్టారని.. ఈ విషయం బయటకు చెబితే రెడ్ టీసీ ఇస్తామని, ఏ స్కూల్‌లోనూ చదివే అవకాశం ఉండదని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఆ బాలిక భయంతో మౌనం పాటించింది. విద్యార్థిని బాగోగులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఫోన్ చేసినా సరైన సమాధానాలు రాకపోవడంతో అనుమానం కలిగింది. నేరుగా స్కూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులకు, జరిగిన విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేక ఆ విద్యార్థిని తన మనసులోని బాధను ఒక కాగితంపై రాసి అందించింది.
ఈ వివరాలు చూసిన తల్లిదండ్రులు షాక్‌కు గురై వెంటనే ములుగు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి, ఆధారాలు సేకరించగా… ఆరోపణలు నిజమని తేలడంతో ఉపాధ్యాయుడు ప్రణయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని ములుగు సీఐ మహేందర్ రెడ్డి ధృవీకరించారు.
ఘటన తీవ్రత దృష్ట్యా.. కేసు వివరాలను గోప్యంగా ఉంచేందుకు పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ ఘటనతో పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాఠశాల నిర్వహణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు