నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. సంజప్ప హత్య నేపథ్యంలో గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు. ఇవాళ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్భందీగా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.. నిర్లక్ష్యం వహించిన ఊట్కూరు ఎస్సై ని సైతం అధికారులు సస్పెన్షన్ విధించారు.
అసలేం జరిగిందంటే..
నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో భూతగాదా విషయంలో నిన్న జరిగిన గొడవలో సంజప్పపై ఏడుగురు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. చచ్చిపోతాడు వదిలేయండని.. కుటుంబసభ్యులు వేడుకున్నా కనికరం లేకుండా కొట్టారు. ఈ దాడిలో సంజప్ప ప్రాణాలు కోల్పోయాడు. అతడేమీ మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, కొట్టి చంపాల్సినంత ఘోరమూ చేయలేదు, కానీ ఏడుగురు కలిసి ఒకడ్ని పట్టుకొని దొడ్డు కర్రలతో చావబాదేశారు. కొట్టొద్దయ్యా… చచ్చిపోతాడయ్యా… అంటూ చిన్నమ్మ వేడుకుంటున్నా… కాళ్ల మీద పడుతున్నా కనికరించకుండా కర్రలతో కొట్టిచంపేశారు. నారాయణపేట్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టాలని డీజీపీని కోరారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన ఊట్కూరు ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ఇవాళ మృతుడి సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మక్తల్, ఊట్కూరు, మాగనూర్, కృష్ణ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికే ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేశారు ఐజీ సుధీర్ బాబు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు
కర్రలతో దాడికి ముందు జరిగిన గొడవ విజువల్స్ బయటకు వచ్చాయి. పొలం విషయంలో మొదలైన తగాదా చంపుకునేంత వరకూ వెళ్లడం సంచలనంగా మారింది.