June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: చెక్‌పోస్ట్ వద్ద కారు ఆపగానే తత్తరపాటు.. ఏంటా అని చెక్ చేయగా..

దేశవ్యాప్తంగా ఎన్నికల తనిఖీలు మొన్నటివరకు విసృతంగా జరిగాయి. ప్రతి వాహనాన్ని కేంద్ర బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. దీంతో కేటుగాళ్ల అక్రమ పనులకు వీలు చిక్కలేదు. దీంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా మరోసారి తమ దందాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

 

ఏ వాహనాన్ని ఆపినా అదే వాసన గుప్పుమంటుంది. ఏ ప్రాంతాంలో తనిఖీలు చేసినా.. అదే మాల్ తారసపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మళ్లీ జోరందుకుంది. ఎన్నికల వేళ విసృత తనిఖీల నేపథ్యంలో గమ్మునుండిపోయిన పెడ్లర్లు మరోసారి.. దందాలు షురూ చేశారు. తాజాగా అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం వన్​టౌన్​ పోలీసులు ​తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పట్టణంలోని అండర్​ బ్రిడ్జ్​ వద్ద ఎస్సై విజయ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులోని వ్యక్తులు తత్తరపడుతూ కనిపంచారు. దీంతో డౌట్ వచ్చి కారును తనిఖీ చేయగా 93 ప్యాకెట్లలో 186 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ. 75లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒరిస్సాలోని మల్కాన్​గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్​కు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన భూక్యా లక్ష్మణ్, పెనుగొండ నరసింహులు, కుంచం లక్ష్మణ్​గా గుర్తించారు. తనిఖీల్లో పాల్గొన్న టాస్క్​ ఫోర్స్​ పోలీసులు, వన్​టౌన్​ పోలీసులను ఎస్పీ బి. రోహిత్​ రాజు అభినందించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఇదే జోష్‌తో ముందుకు సాగాలని సూచించారు.

Related posts

Share via