ఓవైపు పబ్‌లపై ఫోకస్. మరోవైపు గంజాయి దందాపై గ్రౌండ్ లెవల్‌లో ఆపరేషన్. హైదరాబాద్‌లో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి మణికొండ, ఎస్సార్ నగర్ లాంటి ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అయితే ఈసారి పోలీసులు నిర్వహించిన సోదాల్లో కొన్ని షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. లక్షల్లో జీతం మంచి ఉద్యోగం, ఉన్నత యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పటికీ విద్యార్థులు కోటీశ్వరులు అయిపోవాలని గంజాయి విక్రేతలుగా మారిపోయారు.
మణికొండలో ఉంటున్న లోకేష్ అనే ఐటీ ఉద్యోగి ఇంట్లో 2.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం చేస్తున్న లోకేష్ గంజాయికి బానిసగా మారాడు. అతడికి గంజాయి తీసుకొచ్చిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాంత్ కూకట్‌పల్లిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఇంట్లో సైతం ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుండి మరో 22 మంది గంజాయిని కొనుక్కున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది. గంజాయి కొనుక్కున్న 22 మందిని ఎక్సైజ్ పోలీసులు గుర్తించి వారి మీద కూడా కేసులు నమోదు చేశారు.
ఇక ఎస్‌ఆర్ నగర్‌లోని ఒక పీజీ హాస్టల్‌లో సైతం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ఐఐటీ విద్యార్థి ఎక్సైజ్ పోలీసులకు పట్టబడ్డాడు. పవన్ అనే ఐఐటి విద్యార్థి ఉన్నత చదువులను మానేసి గంజాయికి బానిసగా మారారు. డబ్బులు సరిపోకపోవటంతో అదే గంజాయిని విక్రయించడం మొదలుపెట్టాడు. ఒక పీజీ హాస్టల్‌లో రూమ్ తీసుకుని ఉంటున్న ప్రవీణ్ రూమ్‌పై ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ప్రవీణ్ రూమ్‌లో 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఐఐటీ విద్యార్థికి తో పాటు ఐటీ ఉద్యోగికి గంజాయి సప్లై చేసింది ఒకే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వైజాగ్‌కు చెందిన సప్లయర్స్ కోసం ఎక్సైజ్ పోలీసులు వేట మొదలుపెట్టారు. వీరి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసిన వారిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక్కొ కిలో గంజాయిని 20,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది. ఉన్నత భవిష్యత్తు కలిగిన యువత ఈ తరహాలో గంజాయికి బానిసగా మారవద్దని పోలీసులు సూచిస్తున్నారు. బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం