February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: కామెరూన్ దేశం నుంచి వచ్చి హైదరాబాదోళ్లను చీట్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే..

కష్టపడి సంపాదించడానికి కాదు.. పకడ్బందీగా మోసం చేయాలన్నా తెలివితేటలు కావాలి అని అర్థం అవుతూనే ఉంది ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే. అది కూడా దేశం కాని దేశం వచ్చి తన మాయమాటలతో మోసం చేశాడు ఈ ప్రబుద్దుడు. ఇండియన్ కరెన్సీ నోట్లలాగే అచ్చం అలాగే ఉన్న ఫేక్ నోట్లను మార్పిడి చేస్తుండగా ఈ బండారం బయటపడింది. పైగా ఇది మరెక్కడో కాదు.. మన హైదరాబాద్ నగరంలోనే జరగడం గమనార్హం.


హైదరాబాద్ నగరం హయత్‌నగర్‌లో ఓ కామెరూన్ దేశస్థుడు జాక్వెస్ డివొలిస్ కిట్ అరెస్టు అయ్యాడు. ఫేక్ కరెన్సీ నోట్లను మార్పిడి చేస్తుండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చూడటానికి అచ్చం ఇండియన్ కరెన్సీ లాగే కనిపించే ఫేక్ నోట్లను ముద్రించి వాటిని గుడ్డిగా నమ్మే జనాలకు అంటగట్టాలని పెద్ద ప్లానే వేశాడు. అసలైన నోట్లు 5 లక్షలు ఇస్తే 10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తానని మోసపూరిత మాటలతో జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ బండారాన్ని బయటపెట్టాలని హయత్‌నగర్‌ చైత్ర లాడ్జ్‌లో మాటువేశారు. ఫేక్ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు ఫేక్ పాస్‌పోర్టుతో ఇన్ని రోజులు నగరంలో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో సైతం బెంగళూరులో ఇదే రీతిలో ఫేక్ కరెన్సీ కేసులో జాక్వెస్ డివొలిస్ కిట్ అరెస్టు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.


నిజమైన కరెన్సీ అని నమ్మించి జనాలను మోసం చేయడానికి వాడుతున్న ఫేక్ కరెన్సీ అచ్చం నిజమైన నోట్లలాగే ఉండడంతో సామాన్య ప్రజలు గుర్తు పట్టలేని పరిస్థితి. అవే నిజమని నమ్మి ఇలాంటి వాళ్లకు డబ్బులు ఇస్తే నిలువునా మోసం పోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే ప్రజల్లో కూడా ఇలాంటి మోసాల పట్ల కనీస అవగాహన ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు, సైబర్ మోసాలపై పోలీసులతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఏమైనా అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

also read

Related posts

Share via