February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఆపిల్ పండ్లను దొంగిలిస్తున్నాడని.. మరీ ఇంత దారుణమా..?

 

నారాయణపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆపిల్ పండ్లు దొగిలిస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు పండ్ల వ్యాపారులు. మృతదేహాన్ని బస్టాండ్ గ్రౌండ్ లో పడేసి పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


తెలంగాణలో అమానుష ఘటన ఒకటి వెలుగులో వచ్చింది. ఆపిల్ పళ్లు చోరీ చేశాడని అత్యంత పాశవికంగా ప్రవర్తించారు పండ్ల వ్యాపారులు. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన గోపి.. పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తన వ్యాపారం ముగించుకొని మిగిలిన పండ్లను నారాయణపేట మున్సిపల్ కాంప్లెక్స్ గేటు సందులో దాచుకుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా దాచిన ప్రాంతం నుంచి పండ్లు మాయమవుతున్నాయి. ఎంత వెతికినా పండ్ల దొంగలు దొరక్కపోవడంతో పక్కా ప్లాన్ వేసుకుని ఉన్నారు. దొంగలకు భయం కలిగేలా బుద్ధి చెప్పాలని భావించాడు.


ఈ క్రమంలో పండ్లు దొంగిలిస్తూ రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ సింగ్ పండ్ల వ్యాపారి గోపికి తారసపడ్డాడు. గత కొన్ని రోజులుగా దొంగతనం చేస్తున్న షాప్ దగ్గరికి వెళ్లి మరోసారి దొంగతనానికి ప్రయత్నించాడు విక్రమ్ సింగ్. అది గమనించిన పండ్ల వ్యాపారి గోపి అతని స్నేహితులు విక్రమ్ సింగ్‌ను సమీపంలోని క్రీడా మైదానంలోకి లాక్కెళ్లారు. తమతో తెచ్చుకున్న ఇనుప రాడు, ప్లాస్టిక్ పైపులు, కట్టెలతో విక్రమ్ సింగ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దెబ్బలకు తాళలేక విక్రమ్ సింగ్ స్పృహ తప్పి పడిపోయాడు.

ఆ తర్వాత పండ్ల వ్యాపారి గోపి ఏమి తెలియదన్నట్టు విక్రమ్ సింగ్‌ను హాస్పిటల్ తీసుకెళ్లి తాగి పడిపోయాడని చేర్పించాడు. కానీ అప్పటికే విక్రమ్ సింగ్ చనిపోయాడని సిబ్బంది తెలపడంతో షాక్ కు గురయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా విక్రమ్ సింగ్ శవాన్ని దాడి చేసిన గ్రౌండ్‌లోనే వదిలి పారిపోయారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. విక్రమ్ సింగ్‌పై దాడి చేసి చంపిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఇనుప రాడ్, ప్లాస్టిక్ పైపులు, కట్టెలు, ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ సింగ్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో టైల్స్ వేసే పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని బంధువులు తెలిపారు.

Also read

Related posts

Share via