March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Pranay murder case: సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో మరికొన్ని గంటల్లో తుది తీర్పు



తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో రేపే తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రణయ్‌ని అతి కిరాతకంగా మట్టుపెట్టారు అమ్మాయి తరఫు వాళ్లు. ఈ కేసులో 8మంది నిందితులకు ఎలాంటి శిక్ష పడనుంది? ఎలాంటి తీర్పు వెలువడనుంది?


2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ పరువు హత్యగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్‌ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్‌ను దాఖలు చేశారు.


చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. తుది తీర్పును మార్చి 10, ఆదివారంకు రిజర్వు చేసింది. ప్రణయ్ హత్యకేసులో ఎ-1 మారుతీ రావు, ఎ-2 బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, ఎ-3 అజ్గర్ అలీ, ఎ-4 అబ్దులా భారీ, ఎ-5 ఎం.ఏ కరీం, ఎ- 6 శ్రవణ్ కుమార్, ఎ-7 శివ, ఎ-8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు (ఏ-1) 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో A-2 సుభాష్ శర్మ, A-3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే తుది తీర్పు కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Also read

Related posts

Share via