November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: నిమిషాల వ్యవధిలో బ్యాంకు ఖాతా నుంచి కోటి 10 లక్షలు కట్.. ఆ తర్వాత



సైబర్ మోసాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏ రకంగా అవకాశం ఉంటే.. ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే మోసం జరిగిన వెంటనే అప్రమత్తమైతే మీ సొమ్మును కాపాడుకునే చాన్స్ ఉంది.


సైబర్ క్రిమినల్స్ చాలా స్మార్ట్‌గా తయరయ్యారు. అప్రమత్తంగా లేకపోతే ఖాతాలను ఊడ్చేస్తారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు గత నెల 27వ తేదీ ఉదయం మూడు మెసేజులు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం.. అతని అకౌంట్ నుంచి వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.


తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 కి 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది.

బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన సొమ్ము యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులకు వెళ్లడంతో.. ఆ సంస్థల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా హోల్డ్ చేశారు. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి ‘‘1930’’ కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ 1930 నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది

Also read

Related posts

Share via