October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: అమానవీయ ఘటన.. చెట్ల పొదల్లో నుంచి వినిపించిన ఏడుపు.. వెళ్లి చూడగా షాక్..!

మానవత్వం మరిచారు. పుట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే బిడ్డను అడవిలో పడేశారు. ఆకలితో ఆబిడ్డ గొంతు ఎండేలా ఏడ్చాడు. వింటేనే మనసు తరుక్కుపోతూ.. కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ మహానగరం శివారులో వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లిలో దారుణం చోటుచేసుకుంది. గౌడవల్లి రైల్వే గేటు వద్ద చెట్ల పొదల్లో పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అటు వైపుగా వెళుతున్న ఆటో డ్రైవర్ ఆ పసికందును గుర్తించాడు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చూసి చలించిపోయాడు. వెంటనే గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించాడు.

తల్లి పొత్తిళ్లో హాయిగా నిద్రించాల్సిన ముక్కుపచ్చలారని బిడ్డను ముళ్ల పొదల మాటున పడేశారు. పుట్టిన కొన్ని గంటల పాటునే చెట్ల పొదల్లో విసిరేసి వెళ్లారు. అనాధలా కేకలు వేస్తున్న బిడ్డను ఓ ఆటోడ్రైవర్ గమనించి.. ముళ్ల పొదలను దాటుకుంటూ బిడ్డను కాపాడాడు. గ్రామస్తుల సాయంతో ఒడిలోకి తీసుకుని ఎండిన గొంతుకు పాలు పట్టించారు. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రధమ చికిత్స చేయించారు. తర్వాత పోలీసులకు అప్పజెప్పారు.

అప్పుడే పుట్టిన శిశువులను పొదల్లో, నిర్జన ప్రదేశాల్లో పడేస్తున్న ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. కొంతమంది చేసిన తప్పులకు ముక్కుపచ్చలారని శిశువులు రోడ్డున పడుతున్నారు. తాజా ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ చిన్నారిని ఆ ముళ్ళ పొదల్లో ఎవరూ పడవేశారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చిన్నారిని ముళ్ళ పొదల్లో పడవేయడం పట్ల చూసినటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Also read

Related posts

Share via