చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారథని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల వర్గాలు, ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. రాజవరం జీపీ పరిధి ఫకీర్ండాకు చెందిన ఇస్లావత్ తీరమ్మ, కిషన్ దంపతుల కూతురు వర్షిణిని శుక్రవారం కేజీబీవీలో 9వ తరగతిలో చేర్పించారు.
Also read :కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
అదే రోజు సాయంత్రం భోజనం పెట్టే సమయంలో వర్షిణి రాకపోవడంతో ఎస్ఓ పిలవగా.. ఆకలిగా లేదని సమాధానం చెప్పింది. ఆ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయిన వర్షిణి, శనివారం ఉదయం మేల్కొనలేదు. గదులు శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది పలకరించినా సమాధానం రాకపోవడంతో ఆమె కప్పుకున్న దుప్పటి తీయగా వాంతులు చేసుకున్నట్లు గమనించారు. పక్కన కూల్డ్రింక్ బాటిల్ కనిపించడంతో అనుమానంతో ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) సోనికి తెలియజేయగా బాలిక తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా వర్షిణిని స్టేషనఘన్పూర్ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి ఆదివారం ఉదయం మృతి చెందింది.
Also read :NTR District: ఆ ఊర్లో 9వ తరగతి అమ్మాయి.. ఈ ఊర్లో 9వ తరగతి అమ్మాయి మిస్సింగ్.. కట్ చేస్తే..
ఇష్టం లేదని చెప్పింది.. : ఎస్ఓ
ఈ విషయమై ఇన్చార్జి ఎస్ఓ సోని మాట్లాడుతూ, శుక్రవారం వర్షిణి విద్యాలయంలో చేరిన సమయంలో తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని చెప్పిందని వెల్లడించారు. ఈ విషయాన్ని బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లామని, ఆమె కూడా అదే విషయాన్ని చెప్పారని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటుందని ఆమె అన్నారని తెలిపారు.
Also read :పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు
కాగా, బాలిక వెంట తెచ్చుకున్న కూల్డ్రింక్లో పురుగు మందు కలిపి తెచ్చుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మరణానికి కారణాలు ఆస్పత్రి వర్గాల పూర్తి నివేదిక వచ్చాక తెలుస్తుందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి మద్యం తాగినప్పుడల్లా తల్లిని కొడుతుంటే అడ్డుగా ఉండేదానినని.. తనను హాస్టల్లో చేర్పిస్తే గొడవ జరిగినప్పుడు ఎవరు ఆపుతారని వర్షిణి సిబ్బందితో అన్నట్లు తెలిసింది.