అధ్యాయము 20
విస్సావధాన్ల వృత్తాంతము
శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన
నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకారతత్త్వము, సాకారమై, సగుణమై మానవాకారముతో కళ్ళయెదుటనే కన్పించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్త్వమును ముంచెత్తుచుండెను.
శ్రీపాదులవారు అనుగ్రహముతో తమవద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగచేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీ చరణములను భక్తితో స్పృశించితిని. నా శరీరము తేలిక అయినది. నా కన్నులనుండి నల్లని తేజస్సు బయటకువచ్చుట గమనించితిని. ఆ తరువాత, నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సంతయునూ వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి యున్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీ వలెనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా ? అని నన్ను ప్రశ్నించిరి. నేను “స్వామీ! ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితిని కాని, ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు.” అని జవాబిచ్చితిని.
అంతట శ్రీపాదులిట్లనిరి. “నాయనా! ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంక నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతీ మానవశరీరము నందునూ పాప పురుషుడును, పుణ్య పురుషుడును ఉందురు. పాపపుణ్యములు రెండింటినుంచి విడుదల లభించినచో ముక్తియే! బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాపశరీరమును దహించుటయే గాక తన పుణ్యబలము తో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్త్వగుణప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారిచేత ఆచరింపచేయుచూ తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారినుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనునపుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని యెడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని, బ్రహ్మజ్ఞానవంతుడయిన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులయిన బాపనార్యుల వంటివారును, మా పితృదేవులయిన అప్పలరాజశర్మ వంటివారును సద్బ్రాహ్మణులనిపించు కొనగలిగినవారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియును పరమపవిత్రులు. అటువంటి వారి స్మరణమాత్రముచేతనే జీవుల శరీరమునందలి వేలవేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. “
ఈ మాటలను పలికి శ్రీపాదులవారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతివ్రేళ్ళతో తమ భ్రూమధ్యమును తాకి, తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్రవస్తువులు ఉద్భవించెను. కొన్ని మధురఫలములు పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదులవారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదాని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగనే ఆ అగ్ని యందు పడెను. నా శరీరము నందంతటను మంటలుద్భవించెను. నేను స్వామీ! నేను దహింపబడుచున్నాను! రక్షింపుడు! రక్షింపుడు! అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యెను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములయిన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృత మగుటను గమనించితిని. నా నాడీ స్పందనమాగిపోయెను. హృదయ స్పందనమాగిపోయెను. నేను సమాధి స్థితి లోనికి జారుకొంటిని.
మధ్యాహ్నసమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదులవారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై యుండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదులవారు తమ దివ్యహస్తముతో స్పృశించిరి. తమ కమండలమునుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటికోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసికొని తిరిగి కన్నులను తెరచి నావైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర యొకటి ఆవిర్భవించినది. దాని నిండుగా ‘హల్వా’ అని పిలువబడు ఉత్తరదేశ వంటకమొకటి యున్నది. అది శ్రీపాదుల వారికి యిష్ట పాత్రమైన వంటకము. శ్రీపాదులవారు “శంకరభట్టూ! నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తీ శ్రద్ధాలకు మాత్రమె బద్ధుడను. శ్రేష్ఠిగారి యింట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ యీ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసెదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకము నందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షా బంధనము కట్టిన మాట యదార్థమేని నీవు యీ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించ వలసినదని పట్టుబట్టి నిరశనదీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మలనుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల యింట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి యింట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవునూ ఈ ప్రసాదమును స్వీకరించవలసినది.” అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరి తరము? ప్రసాదము నందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారవిడిచిరి. అపుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి యిచ్చెను. ప్రసాదము భూమి లోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యధాస్థితికి వచ్చెను.
అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరినీ నిరాశ పరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టిననూ అది ఇంకనూ అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడను భక్తుడేతెంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రాజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివైచిరి.
తరువాత శ్రీపాదుల వారు “పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే! కారణాంతరమున వారు మాంసభక్షకులయిరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణా! నీవు ఎన్నియో రోజులనుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచూ, శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచూ, జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకరభట్టునకు గురుతత్త్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములనూ ఎవ్వరునూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు. ” అని శెలవిచ్చిరి.
నేను శ్రీ గురుచరణుడనెడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే! శ్రీ గురుచరణుడు యోగామార్గాములో పరిణితి చెందినవాడు. శ్రీపాదులవారి తత్త్వమును నాకు తెలియజేసి ధన్యులనొనర్పుడు అని నేను వారిని ప్రార్థించితిని. అంతట గురుచరణుడు, “అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయముల నొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్త్వమే, సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి, ప్రస్తుతము ఈ యుగమున, ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతాస్వరూపముగా తోచు సర్వదేవతాస్వరూపము, అన్ని యొగమార్గములకునూ గమ్యము. సృష్ట్యాదినుండియూ మహర్షులు తమతమ సాధనావిశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నియూ శ్రీపాదులవారి యొక్క దివ్యస్వరూపములే !
పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండెడివి. వసిశ్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కరలేకుండగ యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడి వారు. ఏదేని ఒక కర్మమును చేయుటకుగాని, ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్రరహస్యమును తెలిసినవాడే సమర్థుడగును. శ్రీపాదులవారు సర్వసమర్థులు. అయితే వారు కర్మరహస్యమును ఎరిగినవారు గనుక ఆయా వ్యక్తుల యెడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనుపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్ఠమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులుగాని, నరసింహవర్మగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠిగాని విచిత్రయోగసంపన్నులు. వారు ముగ్గురికీ శ్రీపాదులవారి యెడల వాత్సల్యభక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదులవారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదులవారు ప్రతీ స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజస్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరయిననూ శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదులవారు కూడా వారి యిండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇదియే మహామాయ. యోగులు, జ్ఞానులు పదేపదే వల్లించిచెప్పెడి నిర్గుణ, నిరాకార పరబ్రహ్మము దివ్యశిశువుగా పీఠికాపురములో దివ్యలీలలను చూపుత తర్కమునకందని విషయము. వేదశాస్త్రముల ఆధ్యయనము ద్వారానూ, యోగమార్గము ద్వారానూ, జ్ఞానమార్గముద్వారానూ దైవము లభించుననెడి అభిప్రాయముతో సాధన చేయువారికి, ఆ దైవము ఆయా మార్గములద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింప వచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీతమార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదులవారి లీలలు అతర్క్యములు. అశ్రుత పూర్వములు.” అని వివరించిరి.
అంతట నేను, అయ్యా! మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను. ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు, అని శ్రీ గురుచరణుని కోరితిని.
అంతట గురుచరణుడు “బ్రాహ్మణోత్తమా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారి సమక్షమున వారి దివ్యలీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుత కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణా కటాక్షము.” అని పలికి తనకు శ్రీపాదులవారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి.
నేను దైవభక్తి గల కుటుంబము లోనే జన్మించితిని. చిన్నతనము నుండియూ నేను మా కులదైవమైన దత్త ప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్ధికచింతలు మెండుగానుండెడివి. దత్త ప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననూ నా కష్టములు తీరలేదు సరి కదా మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు నీకు దత్త ప్రభువుని అనుగ్రహము లేదు. నీవు కులదైవముగా వేరొక దైవతము నెంచుకొని పూజించుకొనిన నీ కష్టములు తీరవచ్చును, అని సలహా యిచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్న నా కష్టములు కడదేరునా యని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వానిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకలమందను పెంచుచుండెను. ప్రతీ రోజునూ కొన్ని మేకలను తన కసాయికత్తికి బలిచేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘగంభీర స్వరమున, “నేను దత్తుడను. నీవు ఏ దేవీదేవతలను ఆరాధనము చేసిననూ ఆ స్వరూపములన్నియూ నేనే! నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారెడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటెను గాను. నీవు నా నీడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు ? సమస్త దేవీదేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే! భగవదవతారములన్నియూ ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే! పులినోట చిక్కిన జంతువు తప్పించుకొన గలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహకిశోరముల వలె నుండవలెను గాని పిరికిపందలు కాకూడదు. నేను సింహము వంటివాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందునూ నిన్ను రక్షింపగలుగువారు ఎవ్వరునూ లేరు. ” అని పలికెను.
నేను భయభ్రాంతుడనై వెఱ్ఱికేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసికొన్న కర్మ ఫలమో ఈనాడు యీ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్ధికబాధలు మరింత మెండాయెను. నేను చనిపోయిననూ బాగుండునని భావించితిని. తెల్లవారగానే మా యింటిముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోసుకొను పాత్ర యొకటుండెను. ఇతడొక వింత హరిదాసు. ఆ ఒఆత్ర యందాతడు ఒక చిన్న మేడిచెట్టు మొక్కను కలిగి యుండెను. హరిదాసు యింటి ముంగిట నిలచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభసూచకమందురు.
అందుచేత యింటిలో బియ్యము ఏమయినా ఉన్నవేమోనని వెదికి, కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసు కిచ్చితిని. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, “అయ్యా! నిన్నరాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనెడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి యీ మేడిమొక్క యందు నిలిచినవి. ఔదుంబర వృక్షమూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరీ మండలమున శ్రీ పీఠికాపురమను మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడనెడి మారువేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహగృహమున నుండు ఔదుంబరవృక్షము యొక్క సంతతి యీ మొక్క. ఈ మొక్క మీ యింటనాటి సర్వశుభములను పొందుము.” అని పలుకగా నాకు తలతిరిగి పోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, “అయ్యా! గురుచరణుడనెడి వాడను నేనే! నేను హత్యకు గురికాలేదు. నేను దత్తభక్తుడినే! నేను స్వప్నమున కసాయివానిని చూచితిని. అతడు తనకత్తితో నన్ను సంహరించెదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనపుడు అతని శవము సంప్రాప్తముకానపుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తరక్రియలను చేయుట వినియున్నాను, అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదుంబరవృక్షములోనికి ఆకర్షించి, అదే సమయములో అదే మనిషియందు ప్రాణములను నిల్పుట ఎచ్చటనూ వినలేదు, కనలేదు. ” అంటిని.
ఔదుంబర వృక్ష మహిమ
అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, “నీవు చెప్పునది నిజమే! కాదనను! ఈ సృష్టి యొక్క మర్మమంతయునూ ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము! ఉత్తర క్షణములో వారు ఏమి చేయసంకల్పించెదరో సప్తర్షులు కూడనూ గ్రహింపజాలరు. అట్టిది నీవెంత ? నేనెంత ? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసికక్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యముగాని కష్టనష్టములకు గురిచేసి కర్మక్షయమొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతారపురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించెడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి, ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరము నందలి ప్రాణశక్తి ద్వారా తానూ జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్ధమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి, భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్టితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడిననూ అది పరిపూర్ణముగనే యుండును. దానికి కారణము శ్రీదత్తాత్రేయుల వారు ప్రతీ ఔదుంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్టితులై యుండుటయే!” అని విశదపరచెను.
నాకు హరిదాసు చెప్పునదంతయూ ఆశ్చర్యముగానుండెను. కృష్ణదాసు అను పేరుగలిగిన ఆ హరిదాసు తన దారివెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో, భక్తితో మా యింటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగనే గడచిపోయెను. మా దూరపు బంధువొకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నాయందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా యింటనే నివసింపమొదలిడెను. నాకు కొంత ధనమొసగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా యింటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలిడెను. మా యింట ఏమి ఇబ్బందులు తలయెత్తిననూ ఔదుంబరమునకు ప్రదక్షిణచేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనెడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరేడిది. మా బాధలు ఊహించనివిధముగా తీరేడివి. దత్తాత్రేయుల వారికినీ, మాకునూ మధ్య స్నేహవారధిగా ఔదుంబరముండెడిది. అయ్యో! దత్తభక్తులకు ఔదుంబరవృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయులవారు సాక్షాత్తు మనయింట ఉన్నట్లే! ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించిననూ అది తక్కువేయగును.
పాపకర్మల ఫలితముగా ముళ్ళచెట్టుగా జన్మించుట
నేను నా వ్యాపార నిమిత్తము ఓఢ్ర దేశమునకు పోవుచూ నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదులవారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముండ్లచెట్టు యొకటున్నది. శ్రీపాదులవారు దానికి శ్రద్ధగా నీరు పొయుచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని “బంగారు కన్నా! నీకు యింత ప్రీతిపాత్రమైన యీ ముండ్లచెట్టు సోమలతయో లేక సంజీవినీ మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించిననూ, వహింపకున్ననూ అది పెరుగుట మానదు.” అనిరి.
అంతట శ్రీపాదులవారు “తాతా! పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి, ‘స్వయంభూదత్తుడే బాపన్నావధాన్ల గారి మనుమడుగా అవతరించెనట! ఎంతటి విడ్డూరము? ఎంతటి దైవద్రోహము? అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే – యీ ముండ్లచెట్టు.’ అమ్మయునూ, నేనునూ, అన్నలునూ, శ్రీవిధ్యాధరి రాధ సురేఖలును వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి యింటనూ, నరసింహవర్మ గారి యింటనూ భోజనము చేయు సందర్భమున ‘మల్లాది వారునూ, ఘండికోట వారునూ బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారినీ బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయ వలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే – యీ ముండ్లచెట్టు.’ ‘శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా? వేదములలో ఉన్నదా?అని కుతర్కములాడిన విస్సావధాన్లు తాతయే – యీ ముండ్లచెట్టు.’ ‘సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనముపెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే ‘వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతనూ, నరసింహవర్మ తాతనూ అను నిత్యమూ దుమ్మెత్తి పోసిన విస్సావధానులు తాతయే – యీ ముండ్లచెట్టు.’ మరణానంతరము ఉత్తరక్రియల లోపములవలన, మహాపాపభారమున, తన స్వభావమునకు తగినట్లుగా ముండ్లచెట్టుగా జన్మించిన ఈ విస్సావధాన్లు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను.” అని తెలిపిరి.
కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధమనోహరరూపమును చూడగనే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నులవెంట ఆనందభాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదులవారి దివ్యపాదపద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదులవారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా! లే! లే! ఏమిటి ఈ పిచ్చిపనులు? చచ్చి, తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా? అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యులవారు నాతో, ఓయీ! మా బంగారుబుడతడికి తగిన పుట్టములేమైనా కలవా? అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టముల నిచ్చితిని. గురుచరణా! నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొనిపోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంటనుండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్లచెట్టు వద్దకు తీసుకొనిపోయి “విస్సన్నతాతా! నీ సంతానము శ్రాద్ధకర్మలవలననూ, బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుటవలననూ నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనెడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీనిచేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా?” అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్లచెట్టును ఆచ్చాదించి యుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విస్సావధానులు అంతకంటెనూ మహాద్భాగ్యము కలదా ? అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదులవారు నా చేత ఆ ముండ్లచెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావిపుల్లను, మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణలవలననూ అగ్ని జనించినది. నేను ఆ ముండ్లచెట్టును దగ్ధము చెసితిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదులవారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, “శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునపుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమునావరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనపుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనముచేసి, అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నిలేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి ఋణానుబంధమో కలిగియున్న ఆ జీవులు ఏదో ఒక పొరబాటువలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి యుండిననే గాని గోఘ్రుతము వంటి పవిత్రపదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయినయెడల దేవతలకునూ, మానవులకునూ విశ్వనియంత చేత ఏర్పరుపబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమమహర్షి తన ఆశ్రమము నందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమమహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయాగోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరీ అవతరణము గావింపబడినది. కావున గౌతమమహర్షికి లోకమెంతయో ఋణపడియున్నది. గౌతమమహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత.
ఈ విస్సావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమమహర్షికినీ, విస్సావధానులకునూ ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రము నందు జన్మించుటయే! ఇది అత్యంత స్వల్పమైన ఋణానుబంధమే అయిననూ, త్రేతాయుగములో యిదే పీఠికాపురములో సవిత్ర కాఠక చయనములో గౌతమమహర్షి కూడా పాల్గొనియున్న కారణముననూ, విస్సావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే గాక, అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణముచేతనూ, అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని యీ దత్తుడు ప్రసాదించగలడనెడిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతనూ, యీ సంఘటన జరిగినది. ఋణానుబంధము లేనిదే శునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్ధమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయుము. వీలు లేకపోయిన శాంత వచనములతో నీ అసమర్ధతను తెల్పుము, అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ యెడల నిర్ధాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో, యీ లోకమెంత సత్యమో, యీ సర్వ సృష్టియునూ ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకునూ నేనే మోలకారణమనెడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకునూ సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా ‘సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ‘ అని చెప్పబడినది. ” అను విషయములను సవివరముగా తెలిపిరి.
నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. బాపనార్యుల చెక్కిళ్ళపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులవారు తాతగారి చెక్కిళ్ళపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టిచేతులతో తుడుచుచూ “తాతా! ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే యుంటున్నావు. నీ జన్మ ధన్యము! అచ్చముగా నీ రూపములోనే నృశింహసరస్వతి అవతారము ధరించెదను. యిది సత్యము!” అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయివైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాదా! ఎన్నియో రోజుల నుండి సందేహము నా మనస్సున నున్నది. అడుగమందువా ? అని సందేహమును వేలబుచ్చిరి. తక్షణమే శ్రీపాదుల చిరునవ్వు నవ్వుతూ, తాతా! నీయంతటి వాడికి సందేహమా? పది సంవత్సరముల బుడతడినయిన నేను తీర్చుటయా? అయిననూ ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదా చేయునది ? శ్రీపాదుడు ‘ఔను’ అనెను. వారియొక్క శక్తిస్వరూపములే కదా సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు ‘ఔను’ అనెను. ఈ త్రిమూర్తులను, వారియొక్క యీ త్రిశక్తులను ఆదిపరాశక్తియే గదా సృష్టించినది. మరల శ్రీపాదుడు ‘ఔను’ అనెను. “అయిన యెడల నీవు ఎవరు?” అని బాపనార్యులు శ్రీపాదులవారిని ప్రశ్నించిరి.
శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికి మూలము శ్రీపాదుడు
తాతగారి నోటివెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధమనోహరముగా నవ్వి, “తాతా! ఇప్పుడే మీ కండ్ల ఎదురగనే ముండ్లచెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్రప్రమాణము ఉన్నదా? అనెడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగభూమికలందుననూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టియందంతటను ఒకే భగవచ్చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమైయున్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనునది అనుభవమున ఉన్నది. ఈ కాలమనునది సూర్యచంద్రాది ఖగోళములవలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయజ్ఞానము ఏకకాలముననే అనుభవములో గల వారు అత్రిమహర్షి. ఈ సృష్టి యందు అనసూయా తత్త్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణశరీరములు. భూత భవిష్యద్వర్తమానములు మొదలయిన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయునూ ఏకకాలముననే అనుభవము, అట్టి స్థితియందు త్రిమూర్తులును, త్రిశక్తులును నా యందే యుండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులును, త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తియందే యున్నారనెడి మాట యదార్థమే! నేనునూ, ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే యిచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియునూ మాతృగర్భము నుండే వెలువడవలననెడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్యపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన యీ విధముగా ఉండవలెననెడి సంకల్పము గాని ఏ విధముగ కలుగవలెను ? దాని ప్రభోదన శక్తియే నేను అనగా మహా సంకల్పస్వరూపము! ఆ మహాసంకల్పము ననుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్పస్వరూపమే పరమ గురుస్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏక కాలము లోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగెడి మూలశక్తిని నేనే! సృష్టియందు మాతాశిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యభర్త సంబంధము, అన్నాచెల్లెల్ల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీదేవతాస్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని, మాయాశక్తియును, మహాశక్తియునూ, యోగశక్తివలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్యపరాశక్తిగా గాని, మూలదత్తునిగా గాని ఆరాధించునపుడు త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ అంతర్లీనస్థితిలో నుండును. ఈ దైవసంబంధములునూ, వాటి తత్త్వములునూ, ఆయాస్థితుల అనుభవములునూ కేవలము సాధనాసంపత్తి కలిగిన వారికే అవగతమగును.”
శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును.
మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచజన్మ నుండి విముక్తమై, మానవజన్మనొంది తగిన సమర్థత కలిగిన వ్యక్తినుండి అది నేర్వవలెను. నేను ప్రతీ జీవితోడనూ అంతర్గతముగా సంబంధమును కలిగియుండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి, ప్రతీ నిత్యము స్నానజపాదులవలన వాటిని దగ్ధముచేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్నారాధించు వారి అనేక పాపసంస్కారములను నా యందు ఆకర్షించుకొని మనయింట కులదైవముగనున్న కాలాగ్నిశమనదత్తుని స్థూలపూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగెడి మహాఫలమును నన్ను ఆరాధించువారికి ధారపోసేదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును గనుక, నేనే చేసెడి కర్మలకు సద్యఃఫలితములు కలుగును గనుక, ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆదిగురుస్వరూపము! తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడైయున్నాడో గురువు యొక్క తపః శక్తికి, ఆ గురువు యొక్క శిష్యులు కూడ వారసులై యున్నారు. భగవద్గీతలో కూడా కర్మచేయుట అనివార్యమను విషయము తెలియ జేయబడినది.
నా అవతారమునకు సమాప్తి లేదు
దత్తుడనయిన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయి వరముల నిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి, వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. తాతా! అందువలననే నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములయిన గురువుల రూపమున నున్నది నేనే! ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగువేసిన, నేను నా భక్తునివైపు నూరు అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తులనుండి, బాధల నుండి కాపాడుట నా సహజ నైజము. ” అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను, మహాప్రభూ! సోమలత గురించియూ, సోమయాగము గురించియూ నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదుల వారు సోమలతనే సంజీవినీమూలిక అని అందురని చెప్పి, నీకు దానిని చూడవలెనని ఉన్నదా? అని అడిగిరి. నేను ఔనంటిని. వెంటనే వారి చేతియందు సంజీవినీ మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా యీనాటికినీ నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది.
శ్రీపాదులవారు “ఈ సంజీవినీ వనమూలికలు హిమాలయ పర్వతశ్రేణులలోనూ, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధూనదీ ఉద్గమస్థానం దగ్గర, మల్లిఖార్జున ప్రభువు నిత్యనివాసమైన శ్రీశైలపర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్రదేవగిరి, వింధ్య పర్వతశ్రేణి, బదరీ అరణ్యప్రాంతములందునూ లభ్యమగుచున్నవి. దీని వలననే లక్ష్మణుడు మూర్ఛనుండి కోలుకొనినాడు. దీనిని సేవించుటవలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనెడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకునూ, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు యిది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్నివలన గాని, జలమువలన గాని, విషము వలన గాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలుకాగానే ప్రతీరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులూ రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్ళలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వతశ్రేణి, భీమశంకరపర్వతముల దగ్గర క్రూరమృగాలు ఈ సంజీవినీమూలికను కాపలాకాయుచుండును. అర్థరాత్రి అమావాస్యరోజున దివ్యకాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా! గురుచరణా! ఈ విధముగా 24 రకాలయిన దివ్య ఔషధమొక్కలు ఉన్నవి. ఇవి అన్నియూ చాలా పవిత్రమయినవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములయిన వేదమంత్రములను ఉచ్ఛరించుచూ, అత్యంత వినమ్రభావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ యిరువయినాలుగు దివ్య ఔషధమొక్కలు 1) సోమ 2) మహాసోమ 3) చంద్రమ 4) అంశుమాన్ 5) మంజువాన్ 6)రజితప్రభు 7) దూర్వా 8)కనియాన్ 9)శ్వేతాన్ 10)కనకప్రభ 11)ప్రతానవాన్ 12)లాల్ వృత్త 13)కరదీర 14) అంశవాన్ 15) స్వయంప్రభ 16)రుద్రాక్ష 17) గాయత్రి 18)ఏష్టమ్ 19)పావత 20)జగత్ 21)శాకర్ 22)అనిష్టమ్ 23)రైక్త 24)త్రిపదగాయత్రి. ” అని తెలిపిరి.
నేను శ్రీపాదుల వారి నుండి శలవుగైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని.
నేను శంకరభట్టునకు యీ వృత్తాంతమును వివరించుట పూర్తికాగానే మహాగురువుల మానససంచారము పూర్తి అయినట్లుగా, వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను, ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి. “మీరు యిరువురునూ కృష్ణ దాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదముపొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్ననూ ఎంతదూరములోనున్ననూ, నేను మిమ్ములను ఎల్లప్పుడునూ గమనించుచునే యుందునని గ్రహింపుడు.
భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవసమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూలదృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూలశరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్ఠమైయున్నది. ఏ యుగములోని వారైననూ, ఏ దేశములోని వారైననూ, ఏ కాలములోని వారైననూ, నా కటాక్షమును పొందిన యెడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్టితమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకూ అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవచైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను.
నాయనా! శంకరభట్టూ! అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థాన మేర్పడగలదు. నా మాతామహ గృహమున నా జన్మస్థలమున ఔదుంబర వృక్షచ్ఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠిoపబడును. నా యొక్క, నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్యదృష్టిని నిచ్చుచున్నాను. చూడుడు! అని గురుచరణుని, నన్నూ భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందరదృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము. లీలలు విచిత్రములు. మేము బయలుదేరునపుడు వారిట్లనిరి. వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!